నల్లగొండ: నల్లగొండ జిల్లాలో సబ్ డివిజన్ స్థాయి పోలీస్ అధికారి వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.ఓ అధికారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు, గతంలో ఎదురైన ఆరోపణలు, కింది స్థాయి సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అధికారి సూర్యాపేట జిల్లాలో సీఐగా పనిచేసిన సమయంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఒకసారి సదరు మహిళ ఫొటోలను తన సోషల్ మీడియా స్టేటస్‌లో పెట్టుకున్నారని, వాటిని గమనించిన కొంతమంది కింది స్థాయి సిబ్బంది స్క్రీన్షాట్లు తీసుకున్నారని సమాచారం.
ఇటీవల అధికారి, మహిళ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.
మరోవైపు ఇటీవల ఆ మహిళ తండ్రి మృతి చెందడంతో నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమానికి మేకలను పంపించిన వ్యవహారం కూడా వివాదానికి కారణమైనట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్ఐ ద్వారా మేకలను పంపించారనే ప్రచారం పోలీస్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
అధికారి గతంలోనూ పలు వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి సిబ్బందిని చిన్నచూపు చూడటమే కాకుండా, వారిని వేధింపులకు గురిచేస్తారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో మరోసారి ఆయన వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాలపై రాష్ట్ర స్థాయి పోలీస్ ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించినట్లు సమాచారం. సంబంధిత ఆరోపణలపై వాస్తవాలు ఏమిటి? పోలీస్ శాఖలో అధికారికంగా ఏమైనా విచారణ జరుగుతోందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
