రైల్వేస్టేషన్లో అయినా.. ఏ హోటల్‌కు వెళ్లినా మనలో చాలామందికి మినరల్ వాటర్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు బిస్లరీ. ఎంతో నమ్మకంతో మనం తాగే ఈ నీటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(FSSAI) గుర్తించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ల్యాబ్ పరీక్షల్లో బిస్లరీ వాటర్ శాంపిల్స్‌లో 'బ్రోమేట్', 'పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్' (PAHs) అనే రెండు రసాయనాలు పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఇవి రెండూ క్యాన్సర్ కారకాలు కావడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ కెమికల్స్ ఏంటి? అవి మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం రండి...
బ్రోమేట్ అంటే ఏంటి? దీని వల్ల కలిగే నష్టాలేంటి?
నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో ముఖ్యంగా ఓజోన్ గ్యాస్ వాడినప్పుడు, నీటిలో సహజంగా ఉండే బ్రోమైడ్తో అది రసాయన చర్య జరిపి 'బ్రోమేట్' తయారవుతుంది. వాటర్ ప్యూరిఫికేషన్ ప్రక్రియను సరిగ్గా పర్యవేక్షించకపోతే దీని మోతాదు పెరిగిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లీటరు నీటిలో బ్రోమేట్ 10 మైక్రోగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ దీనిని క్యాన్సర్ కారకంగా గుర్తించింది. బ్రోమేట్ కలిసిన నీటిని ఎక్కువ కాలం పాటు తాగడం వల్ల కిడ్నీలు, థైరాయిడ్ గ్రంథిలో ట్యూమర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇది మన శరీరంలోని డీఎన్ఏను దెబ్బతీస్తుంది. ఒకవేళ ఈ రసాయనం శరీరంలోకి ఎక్కువ మోతాదులో చేరితే వాంతులు, వికారం, కడుపునొప్పి, కిడ్నీలు దెబ్బతినడం, ఒక్కోసారి వినికిడి లోపం కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
PAHs రసాయనాలతో క్యాన్సర్ ముప్పు..
రెఫరల్ ల్యాబ్ పరీక్షల్లో బిస్లరీ నీటిలో బయటపడిన మరో ప్రమాదకర రసాయనం PAHs. ఇవి సాధారణంగా బొగ్గు, పెట్రోలియం, కలప వంటివి సరిగ్గా కాలనప్పుడు వెలువడే పొగ, వాహనాల కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా వాతావరణంలోకి చేరుతాయి. నీటి వనరులు కలుషితం కావడం వల్ల, నాణ్యత లేని ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం వల్ల ఇవి నీటిలోకి చేరే అవకాశం ఉంది. వీటిలో ఉండే 'బెంజోపైరీన్' అనే రసాయనం నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇవి మన శరీరంలోకి వెళ్ళాక డీఎన్ఏలో మార్పులు చేసి క్యాన్సర్ కణాలు పెరిగేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మన రోగనిరోధక శక్తిని బలహీనపరచడం, సంతానోత్పత్తి సమస్యలకు కూడా ఇవి దారితీస్తాయి.
అన్ని బాటిళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందా?
అయితే ఈ ల్యాబ్ ఫలితాలు కేవలం ఒక నిర్దిష్ట శాంపిల్‌కు సంబంధించినవి మాత్రమే. మార్కెట్లో ఉన్న ప్రతి బిస్లరీ బాటిల్ కలుషితమైందని దీని అర్థం కాదు. కాకపోతే కంటికి ఎంతో స్వచ్ఛంగా కనిపించే నీటిలో కూడా ఇలాంటి విష రసాయనాలు ఉండే అవకాశం ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. వీటిని మనం వాసన చూసో, రుచి చూసో గుర్తించలేము. కాబట్టి వినియోగదారులు వాటర్ బాటిల్ కొనేటప్పుడు దానిపై FSSAI లైసెన్స్ నంబర్, బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ డేట్‌ను తప్పకుండా చెక్ చేయాలి. ముఖ్యంగా ఎండలో స్టోర్ చేసిన వాటర్ బాటిళ్లను అస్సలు కొనకూడదు. ఎండ వేడికి బాటిల్ ప్లాస్టిక్స్ కరిగి వాటిలోని రసాయనాలు నేరుగా నీటిలోకి చేరే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
