హైదరాబాద్: మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపడుతున్న పునరావాస చర్యల్లో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక చేయూత అందిస్తోంది. జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన 214 మంది మావోయిస్టులకు మొత్తం రూ.5.59 కోట్ల నగదు రివార్డులను పంపిణీ చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టు ఉద్యమాన్ని వీడి సాధారణ జీవితం గడపాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గతంలో లొంగిపోయిన ఒక్కొక్కరికి తక్షణ ఆర్థిక సాయంగా రూ.25 వేల చొప్పున అందించామని, ప్రస్తుతం వారికి రావాల్సిన మిగిలిన నగదు రివార్డులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మొత్తం 214 మందికి కలిపి రూ.5.59 కోట్ల రివార్డులు అందించినట్లు తెలిపారు.
2024 సంవత్సరం నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. మావోయిస్టులు హింసాత్మక మార్గాన్ని వీడి సమాజంలో కలిసిపోయి గౌరవప్రదమైన జీవితం గడపాలన్నదే ప్రభుత్వ పునరావాస చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ALSO READ : దమ్ముంటే వరంగల్ అభివృద్ధిపై చర్చకు రా..
మావోయిస్టు రహిత తెలంగాణ దిశగా పోలీస్ శాఖ పునరావాస కార్యక్రమాలను కొనసాగిస్తోందని, లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చే వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
