ఆదిలాబాద్: మంత్రాలతో డబ్బులను రెట్టింపు చేస్తామని, నోట్ల వర్షం కురిపిస్తామని ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇంద్రలో బ్రహ్మానందం పోషించిన పాత్రలో చూపించిన తాంత్రిక విద్యను స్ఫూర్తిగా తీసుకుని నిందితులు మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. మంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తామని, నోట్ల వర్షం కురిపిస్తామని, పూలను డబ్బులుగా మారుస్తామని నమ్మించి అమాయకుల నుంచి నగదు వసూలు చేసినట్లు వివరించారు.
ఈ మోసాలకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశామని, జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
నిందితుల నుంచి రూ.3.74 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా చేతిలో కరీంనగర్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బాధితులు మోసపోయినట్లు తెలిపారు.
ALSO READ : మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా.. 214 మందికి రూ.5.59 కోట్ల రివార్డుల పంపిణీ
మంత్రాలతో డబ్బులు రెట్టింపు కావడం అసాధ్యమని, ఇలాంటి మాయమాటలు చెప్పే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహజన్ సూచించారు. అధిక మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో ఇలాంటి ముఠాల వలలో పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
