డింపుల్ హయాతికి సంపత్ నంది క్షమాపణలు.. 'భోగి' ఈవెంట్‌లో అసలేం జరిగిందంటే?

డింపుల్ హయాతికి సంపత్ నంది క్షమాపణలు.. 'భోగి' ఈవెంట్‌లో అసలేం జరిగిందంటే?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను గ్లామర్ కోణంలోనే కాకుండా.. నటనకు ప్రాధాన్యతనిస్తూ చూపించాలనే అంశంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనికి కారణం లేటెస్ట్ గా దర్శకుడు సంపత్ నంది చేసిన ఓ ఆసక్తికర వ్యాఖ్య. శర్వానంద్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోగి' ట్రైలర్ లాంచ్ వేడుకలో డింపుల్ హయాతికి సంపత్ నంది బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అసలు ఓ దర్శకుడు తన హీరోయిన్‌కు అందరి ముందు సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన ఇచ్చిన మాట ఏమిటి? అన్న దానిపై నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.

డింపుల్ హయాతికి గతంలో సంపత్ నంది ఓ ప్రత్యేకమైన హామీ ఇచ్చారు . ఎలాంటి స్కిన్ షో లేకుండా, అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్‌కు తావివ్వకుండా ఆమెను ఓ అద్భుతమైన పాటలో చూపిస్తానని మాటిచ్చారు.. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాటను సినిమాలో పెట్టలేకపోయానని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని సంపత్ నంది వెల్లడించారు. అంతటితో ఆగకుండా, తమ కాంబినేషన్‌లో వచ్చే తదుపరి సినిమాలో మాత్రం కచ్చితంగా ఆ కోరికను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు డింపుల్ హయాతి కూడా సంపత్ నందిపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో చాలామంది తనను కేవలం గ్లామర్ కోణంలోనే చూశారని.. కానీ సంపత్ నంది మాత్రం తన శరీరాన్ని కాకుండా కళ్లలోని భావాలను గమనించారని చెప్పారు. తనలోని నటిని గుర్తించి 'మందారం' వంటి బలమైన పాత్రను ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక హీరోయిన్‌ను అందంగా చూపించడం అంటే గ్లామర్ మాత్రమే కాదని, ఆమె కళ్లలోని భావాలను కూడా తెరపై అద్భుతంగా ఆవిష్కరించవచ్చని ఈ వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేశాయి. 

ఈ 'భోగి' సినిమాలో శర్వానంద్ గంగ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. 1960ల నాటి గ్రామీణ నేపథ్యంతో, భూస్వామ్య శక్తులు, గ్రామీణ ప్రజల కష్టాలు, వాటిపై తిరుగుబాటు వంటి అంశాలతో ఈ కథ సాగనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. శరత్ శ్వత్, అవినాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేకే రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 

ALSO READ : అనిరుధ్‌– కావ్య మారన్ రిసెప్షన్.. ధోనీతో పాటు అజిత్, రజనీ, నయనతార, విజయ్, రష్మిక సందడి

ఇప్పటికే ట్రైలర్‌తో మాస్ అంచనాలు పెంచిన 'భోగి' నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.