బిస్లరీ బాటిల్ వాటర్ ఎంతో సురక్షితం: ఫుడ్ సేఫ్టీ నోటీసులే ఇవ్వలేదన్న కంపెనీ

బిస్లరీ బాటిల్ వాటర్ ఎంతో సురక్షితం: ఫుడ్ సేఫ్టీ నోటీసులే ఇవ్వలేదన్న కంపెనీ

తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్ సురక్షితం కాదంటూ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(FSSAI) చేసిన ఆరోపణలపై బిస్లరీ ఇంటర్నేషనల్ తీవ్రంగా స్పందించింది. తాము అమ్ముతున్న తాగునీరు వినియోగదారులకు పూర్తిగా సురక్షితమేనని స్పష్టం చేస్తూ నవంబర్ 23, 2026 సోమవారం నాడు కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ల్యాబ్ పరీక్షల ఫలితాలను తాము పూర్తిగా ఖండిస్తున్నట్లు బిస్లరీ తేల్చి చెప్పింది.

14 నెలల నాటి పాత బ్యాచ్ వివాదం
ప్రస్తుత వివాదమంతా సుమారు 14 నెలల క్రితం నాటిదని బిస్లరీ వివరించింది. దేశవ్యాప్తంగా తమకున్న 143 ప్లాంట్లలో ఒకటైన గోవా ప్లాంట్‌లో 2025 సెప్టెంబర్‌లో తయారైన ఒక బ్యాచ్‌కు సంబంధించినదిగా కంపెనీ పేర్కొంది. 2025 సెప్టెంబర్ 30న FSSAI అధికారులు ఆ ప్లాంట్ నుంచి మొత్తం 6 శాంపిల్స్ సేకరించగా.. వాటిలో 5 శాంపిల్స్ అన్ని ప్రమాణాలకు అనుగుణంగా పాస్ అయ్యాయని తెలిపింది. కేవలం ఒక్క శాంపిల్‌లో మాత్రమే లీటరుకు 10 మైక్రోగ్రాములు ఉండాల్సిన బ్రోమేట్ స్థాయి 12 మైక్రోగ్రాములుగా నమోదైందని చెప్పింది.

ల్యాబ్‌ల మధ్య భిన్నమైన ఫలితాలు..
6వ శాంపిల్ ఫలితాలపై తాము అప్పీల్ చేయడంతో.. FSSAI దానిని రీ-టెస్టింగ్ కోసం రెఫరల్ ల్యాబొరేటరీకి పంపిందని బిస్లరీ తెలిపింది. అయితే ఆ రెఫరల్ ల్యాబ్ పరీక్షల్లో బ్రోమేట్ స్థాయి పరిమితికి లోబడే ఉందని తేలిందని, కానీ అక్కడ కొత్తగా PAHs అనే రసాయనాలు ఉన్నట్లు పేర్కొన్నారని కంపెనీ గుర్తుచేసింది. ఒకే శాంపిల్‌పై రెండు ల్యాబ్‌లు భిన్నమైన ఫలితాలు ఇవ్వడంపై బిస్లరీ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టత కోసం తాము FSSAI గుర్తింపు పొందిన మరో స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్షలు చేయించగా.. అందులోనూ బ్రోమేట్ స్థాయి సేఫ్ లిమిట్స్‌లోనే ఉన్నట్లు నిర్ధారణ అయిందని స్పష్టం చేసింది.

ALSO READ : బిస్లరీ వాటర్ బాటిళ్లల్లోని కెమికల్స్.. మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటే..?

నీటి నాణ్యతలో రాజీ ఉండదు..
ఈ ఇండిపెండెంట్ ల్యాబ్ రిపోర్టులను 2026 ఫిబ్రవరి 2న FSSAI వెస్ట్రన్ రీజినల్ ఆఫీస్‌కు సమర్పించామని.. ఆ తర్వాత అధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని బిస్లరీ ప్రతినిధి తెలిపారు. ఆ వ్యవహారం అక్కడితో ముగిసిపోయిందని తాము భావించామని, ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు కూడా అందలేదని పేర్కొన్నారు. తమ తయారీ ప్రక్రియలోని 10 దశల్లో 90కి పైగా కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తామని.. తమ నీరు ఎంతో సురక్షితమని బిస్లరీ భరోసా ఇచ్చింది. ఈ విషయంలో FSSAI కి పూర్తిగా సహకరిస్తూనే.. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది.