సినీ ఇండస్ట్రీలో పెళ్లి అనేది హీరో, హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ముఖ్యంగా ఒక వయసు దాటిన తర్వాత పెళ్లెప్పుడు? ఎవరిని చేసుకోబోతున్నారు? అంటూ సెలబ్రిటీలకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. లేటెస్ట్ గా ఈ ప్రశ్నలపై నటి నిత్యామీనన్ తనదైన శైలిలో స్పందించారు. పెళ్లి విషయంలో తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, జీవితంలో సరైన వ్యక్తి దొరికితే వివాహం చేసుకోవడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. అయితే తన జీవితంలో ప్రస్తుతం ఉన్న ప్రశాంతతను దెబ్బతీసే నిర్ణయం మాత్రం తీసుకోనని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
గత ఏడాది 'తలైవన్ తలైవీ', 'ఇడ్లీ కడై' వంటి సినిమాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నిత్యామీనన్.. ఇప్పుడు బాలీవుడ్ లో 'మిస్టర్ అండ్ మిసెస్ గ్రే' లో నటించారు. వైవిధ్యమైన కథలను, బలమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితం గురించి కూడా తరచూ చర్చ జరుగుతుంటుంది. తన తోటి హీరోయిన్లు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతుండటంతో నిత్యామీనన్ మాత్రం పెళ్లికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో స్పందించిన బ్యూటీ.. తనను చాలామంది పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారు. కానీ అందులో నిజం లేదని చెప్పారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని, తనకు నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని కోరిక ఉందని మనసులో మాట బయటపెట్టారు. అయితే ఇప్పటివరకు తనకు పరిచయమైన వారిలో తాను కోరుకునే జీవనశైలికి సరిపోయే వ్యక్తి ఎవరూ కనిపించలేదని నిత్య తెలిపారు.
ప్రస్తుతం తన జీవితం ఎంతో అందంగా, ప్రశాంతంగా సాగుతోందని, ఆ ప్రశాంతతకు భంగం కలిగించే బంధంలోకి ఎందుకు వెళ్లాలని ఆమె ప్రశ్నించారు. కేవలం సమాజం కోసమో.. లేదా వయసు అయిపోయిందనే కారణంతో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదనే విషయాన్ని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి నిత్యామీనన్ మొదటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య స్పష్టమైన హద్దులు పెట్టుకుంటూ వస్తున్నారు.
ALSO READ : డింపుల్ హయాతికి సంపత్ నంది క్షమాపణలు..
ఈ నేపథ్యంలో ఇప్పుడు నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు.. చేసుకోకపోవడం కూడా తప్పు కాదు. మనకు నచ్చిన జీవితాన్ని, మనశ్శాంతిని కాపాడుకోవడమే ముఖ్యమన్న ఆమె ఆలోచనకు చాలామంది మద్దతు తెలుపుతున్నారు. మరి నిత్యామీనన్ మనసుకు నచ్చిన తోడు ఎప్పుడు దొరుకుతారో చూడాలి..
