అత్తాపూర్‌ లో అక్రమ నిర్మాణం.. రెండంతస్తుల బిల్డింగ్ నేలమట్టం

అత్తాపూర్‌ లో అక్రమ నిర్మాణం.. రెండంతస్తుల బిల్డింగ్ నేలమట్టం

హైదరాబాద్: రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 183 వద్ద నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని సోమవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు.

పీఎన్‌ఆర్ అపార్ట్‌మెంట్స్‌కు చెందిన ఖాళీ స్థలంలో బీఆర్‌ఎస్ పార్టీ రాజేంద్రనగర్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారంటూ అపార్ట్‌మెంట్ వాసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేశారు.

కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సోమవారం జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి కూల్చివేత చర్యలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ALSO READ : మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా..

ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో ఎలాంటి పక్షపాతం ఉండదని తెలిపారు. కోర్టు ఆదేశాలు, నిబంధనల ప్రకారమే కూల్చివేత చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.