హర్యానా మ్యూజిక్ ఇండస్ట్రీలో తన డ్యాన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన సప్నా చౌదరి వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ భర్త వీర్ సాహుకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది ఈ బిగ్‌బాస్ బ్యూటీ..
లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో సప్నా తన వైవాహిక జీవితంపై మనసు విప్పింది. తమ మధ్య ఏం జరిగిందో తనకు, వీర్‌కు మాత్రమే తెలుసని స్పష్టం చేసింది. పరిస్థితులు బాగున్నప్పుడు కలిసి ఉన్నామని, బంధం సజావుగా సాగనప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తమ వ్యక్తిగత జీవితంపై ఇతరులు తీర్పులు ఇవ్వడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ప్రేమ అంటే కేవలం శారీరక ఆకర్షణ కాదని, అది మనసుకు, ఆత్మకు సంబంధించిన భావోద్వేగమని తెలిపింది. పురుషులు ఎక్కువగా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారని, మహిళలు మాత్రం భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అభిప్రాయపడింది. భర్తల నమ్మకద్రోహంపై కూడా ఆమె వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే తమ బంధం విచ్ఛిన్నానికి అసలు కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
పెళ్లి తర్వాత తన కెరీర్, వ్యక్తిగత గుర్తింపు వెనుకబడిపోయాయని సప్నా ఆవేదన వ్యక్తం చేసింది. భార్యగా, తల్లిగా, కోడలిగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ.. తనను తాను పట్టించుకోవడం మానేశానని చెప్పింది. ఒకరి భార్యగానో, మరొకరి తల్లిగానో మాత్రమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావిస్తున్నట్లు తెలిపింది. మరో పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని బదులిచ్చింది. తాను ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తానని, తన ప్రేమకు అర్హుడైన వ్యక్తి ఎదురైతేనే మరో బంధం గురించి ఆలోచిస్తానని చెప్పింది.
2020 జనవరిలో హర్యానా నటుడు, గాయకుడు వీర్ సాహును సప్నా రహస్యంగా వివాహం చేసుకుంది. మొదటి బిడ్డ పుట్టిన తర్వాతే పెళ్లి విషయం బయటకు వచ్చింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిగ్‌బాస్ 11తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సప్నా.. ఇకపై తన జీవితాన్ని, కెరీర్‌ను ఎలా మలుచుకుంటుందో చూడాలి..
