బిస్లెరీ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదని FSSAI నిర్దారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్రమత్తమైన FSSAI దేశవ్యాప్తంగా ఉన్న తాగునీటి బ్రాండ్లపై ఫోకస్ పెట్టింది. ఇతర ప్యాకేజ్డ్ తాగునీటి బ్రాండ్ల శాంపిల్స్ సేకరించి పరీక్షలు ప్రారంభించినట్లు తెలిపారు అధికారులు.
బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టాలని నిర్ణయించిన కొద్ది రోజులకే ఈ తనిఖీలు ముమ్మరం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోని అన్ని ప్రధాన తాగునీటి బ్రాండ్ల నమూనాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైందని, నిబంధనల అమలు తీరుపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు అధికారులు.
అసలేం జరిగింది..?
బిస్లెరీకి చెందిన ఒక నీటి నమూనా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని FSSAI గుర్తించింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెగ్యులేటరీ సంస్థ, సదరు కంపెనీపై ప్రాసిక్యూషన్ చర్యలకు ఆదేశించినట్లు పేర్కొంది. అయితే, తమ నీరు సురక్షితమని, ఈ విషయంలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని బిస్లెరీ తెలిపింది.
14 నెలల క్రితం నాటి వివాదం:
ఈ వివాదం 14 నెలల క్రితం నాటిదని బిస్లెరీ వెల్లడించింది. 2025 సెప్టెంబర్‌లో గోవాలోని తమ ప్లాంట్‌లో తయారైన బ్యాచ్‌కు సంబంధించినదిగా కంపెనీ పేర్కొంది. 2025 సెప్టెంబర్ 30న FSSAI అధికారులు ఆ ప్లాంట్ నుంచి 6 నమూనాలను సేకరించారు. అందులో ఐదు నమూనాలు ప్రమాణాల ప్రకారం ఉన్నాయని, ఆరో నమూనాలో మాత్రం బ్రోమేట్ (Bromate) స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదైందని కంపెనీ తెలిపింది. నిబంధనల ప్రకారం దీని పరిమితి 10 మైక్రోగ్రాములు మాత్రమే ఉండాలి.
ల్యాబ్ రిపోర్ట్స్ పై సందిగ్ధత:
తొలి పరీక్ష ఫలితాలపై బిస్లెరీ అప్పీల్ చేయడంతో, FSSAI ఆ నమూనాను రీ-టెస్టింగ్ కోసం రెఫరల్ ల్యాబొరేటరీకి పంపింది. ఆ ల్యాబ్ నివేదికలో బ్రోమేట్ స్థాయి నిర్ణీత పరిమితిలోనే ఉందని తేలింది. కానీ, అదే సమయంలో నీటిలో 'పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్' (PAHs) ఉన్నట్లు రెఫరల్ ల్యాబ్ గుర్తించిందని సమాచారం.
దీంతో బిస్లెరీ స్వయంగా మరోసారి FSSAI గుర్తింపు పొందిన స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్షలు చేయించగా, అందులో నీరు సురక్షితమని తేలినట్లు కంపెనీ వాదిస్తోంది. ఈ ఫలితాలను 2026 ఫిబ్రవరి 2న FSSAI పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించామని, అప్పటి నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని కంపెనీ పేర్కొంది.
నోటీసులు అందలేదన్న కంపెనీ:
ప్రస్తుత ప్రాసిక్యూషన్ చర్యలకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని బిస్లెరీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అధికారుల నుంచి ఈమెయిల్ కానీ, హార్డ్ కాపీ కానీ రాలేదని తెలిపింది. తాము 90కి పైగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తామని, వినియోగదారుల భద్రతే తమకు ప్రాధాన్యమని సంస్థ పేర్కొంది.
మరోవైపు, బిస్లెరీ ఉదంతంతో అప్రమత్తమైన FSSAI, దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్లో నిబంధనల అమలును కఠినతరం చేస్తోంది. అన్ని బ్రాండ్ల నీటి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించింది.
