ఈరోజుల్లో హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. అప్పటి దాకా ఆరోగ్యంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి గుండె ఆగిపోయి ప్రాణం పోతున్న రోజులివి. సాధారణంగా వీపు నొప్పి వస్తే కండరాల నొప్పి అని భావిస్తుంటాం. లేదా పడుకునే పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిందని అనుకుంటాం. కానీ.. అమెరికాలో ఓ 45 ఏళ్ల మహిళకు ఎదురైన అనుభవం ఇప్పుడు అందరినీ అప్రమత్తం చేస్తోంది. తనకు వచ్చిన వీపు నొప్పిని మామూలు సమస్యగా భావించి ఆమె కూడా లైట్ తీసుకుంది. చివరకు గుండెకు వెళ్లే ధమని పూర్తిగా బ్లాక్ అయి హార్ట్ ఎటాక్ వరకూ వెళ్లింది.
అమెరికాకు చెందిన టియా ఎమర్డ్ క్రిస్మస్ వేడుకల అనంతరం ఇల్లు శుభ్రం చేస్తుండగా వీపు మధ్యలో తీవ్రమైన నొప్పిని గమనించారు. ఆమెకు గతంలోనే వీపు, మోకాళ్ల నొప్పులు ఉండటంతో, దీనిని కూడా సాధారణ నొప్పేనని భావించి విశ్రాంతి తీసుకున్నారు. కాసేపు కూర్చున్న తర్వాత నొప్పి తగ్గడంతో ఆ రాత్రి నిద్రపోయారు. అయితే మరుసటి రోజు కూడా ఆమెకు అదే నొప్పి కొనసాగింది. నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది.
నొప్పి తగ్గడానికి మందులు వేసుకున్నప్పటికీ ఫలితం లేకపోగా, ఆ తర్వాతి రోజు ఆమె విపరీతమైన నీరసానికి గురయ్యారు. నొప్పి వీపు నుంచి మెడ, భుజాల వరకు వ్యాపించడంతో ఆమె వెంటనే వైద్యులను సంప్రదించారు. అక్కడ చేసిన ఈసీజీ (ECG) పరీక్షలో టియాకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఆమె గుండె ఎడమ భాగానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమని వంద శాతం మూసుకుపోయిందని నిర్ధారించారు. దీంతో వైద్యులు వెంటనే కార్డియాక్ కాథెటరైజేషన్ ప్రక్రియ చేపట్టి, స్టెంట్ వేయడం ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించారు.
మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషులతో పోల్చితే కొంచెం భిన్నంగా ఉంటాయి. గుండెపోటు అంటే కేవలం ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ మహిళల్లో లక్షణాలు భిన్నంగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. టియా విషయంలో మొదట వీపు నొప్పి ప్రారంభమై, ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కనిపించాయి. మహిళలు గుండెపోటు సమయంలో కింద పేర్కొన్న లక్షణాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు:
* వీపు, మెడ, దవడ, భుజాలు లేదా చేతుల్లో అసౌకర్యం.
* ఛాతీలో నొప్పి ఉన్నా లేకపోయినా ఊపిరి ఆడకపోవడం.
* విపరీతమైన లేదా అసాధారణమైన అలసట.
* వికారం, వాంతులు లేదా అజీర్ణం వంటి సమస్యలు.
* తల తిరగడం లేదా స్పృహ తప్పినట్లు అనిపించడం.
* చెమటలు పట్టి ఒళ్లంతా చల్లబడిపోవడం
వైద్య చికిత్స అనంతరం టియా కోలుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమె తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ద్వారా ఆమె తన బరువును 335 పౌండ్ల నుంచి సుమారు 170 పౌండ్లకు తగ్గించుకున్నారు. శరీరంలో కనిపించే అసాధారణ మార్పులను, ముఖ్యంగా మహిళలు తమకు వచ్చే నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యమని ఈ ఘటన రుజువు చేసింది.
