బంతుల నాణ్యత తగ్గింది.. పాత బాల్స్ మళ్లీ తీసుకురండి.. ఐసీసీకి గిల్ కీలక సూచన!

బంతుల నాణ్యత తగ్గింది.. పాత బాల్స్ మళ్లీ తీసుకురండి.. ఐసీసీకి గిల్ కీలక సూచన!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిబంధనలు, బంతుల నాణ్యతపై సంచలన ప్రశ్నలు లేవనెత్తాడు. ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ టెస్టులో ఏకంగా 1,327 పరుగులు నమోదు కాగా, కేవలం 25 వికెట్లు మాత్రమే పడ్డాయి. పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లేకపోవడానికి తోడు, కుకబుర్రా (Kookaburra) బంతులు 25-30 ఓవర్లకే మెత్తబడిపోవడం బౌలర్లకు శాపంగా మారిందని గిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. బంతిని మెరిపించేందుకు లాలాజలం (Saliva) వాడకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని గిల్ డిమాండ్ చేశాడు.

బంతుల నాణ్యత తగ్గింది: గిల్

మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మ్యాచ్ ఫలితంలో బంతి కీలక పాత్ర పోషిస్తుంది. న్యూజిలాండ్‌లో మా తొలి బంతి 25–30 ఓవర్లకే బాగా మెత్తబడిపోయింది. ప్రత్యర్థి జట్టు కూడా దీనిపై ఫిర్యాదు చేసిందనుకుంటున్నా.. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో డ్యూక్స్ బంతుల విషయంలోనూ ఇదే జరిగింది. అసలు బంతుల నాణ్యత తగ్గిందో ఏమో తెలియడం లేదు.. పిచ్ సహకరించనప్పుడు బంతి కూడా మెత్తబడితే బౌలర్లు వికెట్లు తీయడం అసాధ్యం.. ఎడ్జ్‌లు కీపర్, స్లిప్స్ వరకు క్యారీ కావడం లేదు.. ఇక ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్‌లపైనే ఆధారపడాల్సి వస్తోందని గిల్ అసహనం వ్యక్తం చేశాడు. బంతిని మెరిపించేందుకు లాలాజలం ఎందుకు అనుమతించడం లేదో నాకు అర్థం కావడం లేదు.. కోవిడ్ పరిస్థితులు దాటి ఏళ్లు గడిచిపోయింది.. అయినా ఇప్పటికీ ఆ నిషేధం ఎందుకు కొనసాగిస్తున్నారు? బంతి రివర్స్ స్వింగ్ అవ్వడానికి, మెరుపు కాపాడుకోవడానికి ఇది చాలా పెద్ద అంశం అని పేర్కొన్నాడు.

గిల్ వ్యాఖ్యలకు న్యూజిలాండ్ కెప్టెన్ సపోర్ట్: 

శుభ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలపై న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) మాట్లాడుతూ.. బంతి పరిస్థితి గురించి భారత కెప్టెన్ గిల్ చెప్పింది అక్షరాలా నిజం.. తొలి రోజు పిచ్‌లో కొంత సహకారం ఉన్నప్పటికీ, మ్యాచ్ కొనసాగేకొద్దీ బాల్ త్వరగా మెత్తబడిపోయింది. కొత్త బంతితో తొలి 10 ఓవర్లు ముగిశాక పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. సాధారణంగా న్యూజిలాండ్ పిచ్‌లపై బంతి గట్టిగా ఉండి, ఎక్కువ సేపు స్వింగ్ అవుతుంది.. కానీ ఈసారి అలా జరగలేదని అతడు అంగీకరించాడు. ప్రపంచం ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా లాలాజలంపై నిషేధం మారుతుందని నేను అనుకోవడం లేదు.. ప్రస్తుత నిబంధనలకు లోబడే బంతిని మెరుగ్గా ఉంచుకుంటూ స్వింగ్ రాబట్టే మార్గాలను వెతుక్కోవాలని కివీస్ కెప్టెన్ లాథమ్ అభిప్రాయపడ్డాడు.