హైదరాబాద్: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. మరో 10 TMCల నీళ్లు కావాలని ఏపీ ప్రతిపాదన ఉంచింది. 10 చుక్కలు కూడా ఇవ్వబోమని తెలంగాణ తేల్చి చెప్పింది. వచ్చే 3 నెలల తాగునీటి అవసరాల కోసం 30 TMCలు కావాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది.
ఎటూ తేలకుండానే కృష్ణా బోర్డు త్రీ మెంబర్ కమిటీ సమావేశం ముగిసింది. తన్నుకుపోయిన పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు సాగర్ నీళ్లపైనా కన్నేసింది. తెలంగాణ వాడుకోవడానికి శ్రీశైలం నుంచి తెచ్చుకుని సాగర్లో స్టోర్ చేసుకున్న నీటినీ తన్నుకుపోవాలని ఏపీ ప్రయత్నిస్తున్నది.
అందులో భాగంగానే సాగర్ ప్రాజెక్ట్ నుంచి మరో 10 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలంటూ కృష్ణా బోర్డును కోరింది. ఈ నెల 25 నుంచి మూడు నెలల పాటు తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాల్వల నుంచి నీటిని విడుదల చేయాలని కోరింది.
పల్నాడు, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చడానికి కుడి కాల్వ నుంచి 8 టీఎంసీలు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల తాగునీటి ఎడమ కాల్వ నుంచి 1 టీఎంసీ నీటిని ఇవ్వాలని కోరడం గమనార్హం. ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
