- వైఎస్‌కు, జగన్‌కు, బాబుకు కృష్ణా నీళ్లు తాకట్టు పెట్టింది మామా అల్లుళ్లే
- ఉరేయాల్సింది.. కోదండమేసి కొట్టాల్సింది ఆ ఇద్దరినే: సీఎం రేవంత్
- రాజకీయంగా శాశ్వత సమాధి కడితేనే ఆ దొంగలకు బుద్ధి
- కేసీఆర్ ఏపీకి మంచోడు.. తెలంగాణకు ముంచెటోడు
- పోతిరెడ్డిపాడుకు బడ్జెట్ పెట్టినప్పుడు హరీశ్ రావు మంత్రి
- పల్నాడు గ్రిడ్‌కు జీవో ఇచ్చింది మీ దోస్త్ జగనే.. అప్పుడు నిద్రపోయిన్రా?
- ఏపీ తోడే సామర్థ్యం రోజుకు 4.47 నుంచి 13.17 టీఎంసీల ఘనతా బీఆర్ఎస్దే
- బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో 6 నుంచి 8 నెలల్లో 575 టీఎంసీలను మేం సాధిస్తం
- కృష్ణాపై ప్రాజెక్టులకు మీరు పదేండ్లలో ఖర్చు చేసింది రూ.11 వేల కోట్లు.. మేం 34 నెలల్లోనే ఖర్చుపెట్టింది రూ.6,767 కోట్లు
- మేడిగడ్డలో బాంబులా? బుర్ర మోకాల్లో ఉందా? అరికాళ్లలో ఉందా?
- ‘కాయే నై.. పీయే నై.. గిలాస్ ఫోడ్ దియే’ అన్నట్టుగా కేసీఆర్ పాలన
- సాగర్ పనులు 1.8 టీఎంసీలే.. 90 టీఎంసీలంటూ అబద్ధాలు: ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నీటి హక్కులను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌కు, స్వరాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని శాశ్వత జల సమాధి చేసింది ముమ్మాటికీ కేసీఆర్, హరీశ్ రావులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి, మన నీటి హక్కులను జల సమాధి చేసినందుకు ఉరేయాల్సి వచ్చినా.. కోదండమేసి కొట్టాల్సివచ్చినా.. అది కేసీఆర్, హరీశ్లనే’ అని అన్నారు. ‘కాయే నై.. పియే నై.. గిలాస్ ఫోడ్ దియే’ అన్నట్లు పదేండ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, కమీషన్ల కోసం ప్రాజెక్టుల పేర్లు, డిజైన్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ సర్కారుపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు.
‘మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్లకు సరిపోలేదు. ప్రజాక్షేత్రంలో రాజకీయంగా శాశ్వత సమాధి కట్టినప్పుడే ఆ దొంగలకు బుద్ధి వస్తుంది’ అని అన్నారు. సోమవారం ఎంసీహెచ్ఆర్డీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్యతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. 2004 నుంచి 2023 వరకు జరిగిన జల దోపిడీకి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాలు, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పుస్తకాలు, జీవోలు, అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ కాపీలను మీడియా ముందు ప్రదర్శిస్తూ ‘బీఆర్ఎస్ పాపాల చిట్టా ఇదిగో’ అంటూ ఆధారాలు చూపించారు.
పోతిరెడ్డిపాడు పాపంలో హరీశే ప్రధాన ముద్దాయి
తెలంగాణ నీళ్లను రాయలసీమకు దోచిపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ పాపంలో హరీశ్ రావే ప్రధాన ముద్దాయి అని సీఎం అన్నారు. 2005 మార్చి 29న ఉమ్మడి అసెంబ్లీలో అప్పటి ఇరిగేషన్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు) ప్రవేశపెట్టిన ‘డిమాండ్ ఫర్ గ్రాంట్స్’ పుస్తకాన్ని మీడియాకు చూపించారు. అందులోని 11వ పేజీలో శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు కాలువ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు రూ.1,252 కోట్లు కేటాయించినట్లు స్పష్టంగా ఉందని చదివి వినిపించారు. వైఎస్సార్ కేబినెట్ ఈ బడ్జెట్‌ను ఆమోదించినప్పుడు హరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి సహా టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారన్నారు.
‘రాజకీయాల్లోకి రాకముందు వార్డు మెంబర్ కూడా కాని హరీశ్‌ను ఎమ్మెల్యేను చేసి, మంత్రిని చేసిన వైఎస్సార్‌కు గురుదక్షిణగానే పోతిరెడ్డిపాడును 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే నిర్ణయానికి హరీశ్ ఆమోదం తెలిపారు’ అని మండిపడ్డారు. మంత్రిగా వైఎస్సార్ మోచేతి నీళ్లు తాగిన హరీశ్, ఇప్పుడు ‘జూలైలో రాజీనామా చేశాం, జీవో 170 సెప్టెంబర్‌లో వచ్చింది’ అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఎండగట్టారు. మార్చిలో అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందాకే సెప్టెంబర్‌లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌గా జీవో 170 వచ్చిందని, కేబినెట్లో ఉండి నిధులు కేటాయించిన హరీశ్ ఈ మహాద్రోహం నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. 2004 జూలై 24న జీవో ఎంఎస్ 73 ద్వారా శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించే హంద్రీ–నీవాకు కూడా వైఎస్సార్–టీఆర్ఎస్ సంకీర్ణ కేబినెట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని డాక్యుమెంట్లు బయటపెట్టారు. శ్రీశైలంలో 835 అడుగుల వద్ద మాల్యాల, డెడ్ స్టోరేజీ 815 అడుగుల వద్ద ముచ్చుమర్రి లిఫ్ట్‌తో కేసీ కెనాల్, హంద్రీ–నీవాలకు నీళ్లు పీల్చేసేందుకు కేసీఆర్ సహకరించారని ఆరోపించారు.
ప్రగతి భవన్ విందుతోనే రాయలసీమ లిఫ్ట్
రాయలసీమ లిఫ్ట్ పుట్టుక ప్రగతి భవన్ విందుల ఫలితమేనని సీఎం ధ్వజమెత్తారు. 2019 జూన్ 28న జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి విందు పెట్టాకే, 2020 మే 5న ఏపీ జీవో 203 తెచ్చి శ్రీశైలంలో 797 అడుగుల అట్టడుగు స్థాయి నుంచి బురదతో సహా రోజుకు 3 టీఎంసీలు తోడేసే రాయలసీమ లిఫ్ట్‌ను తెరపైకి తెచ్చిందన్నారు. ‘కుండలో పై నుంచి నీళ్లు తీసుకోకుండా అడుగున రంధ్రం వేసి ఏపీకి అప్పగించిన ఘనుడు కేసీఆర్ కాదా?’ అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే కేసీఆర్ సర్కారు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయించి జగన్‌కు రాచబాట వేసిందని గుర్తుచేశారు. 2019 జూలై 25న ఏపీ అసెంబ్లీలో ‘కేసీఆర్ మంచి మనిషి, ఏపీకి మేలు చేసేందుకు సహకరిస్తున్నారు’ అని జగన్ కితాబిచ్చారని, ‘జగన్‌కు కేసీఆర్ మంచి మనిషే కావొచ్చు, కానీ తెలంగాణ పాలిట ముంచే మనిషి’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాకముందు కృష్ణా నుంచి రోజుకు 4.47 టీఎంసీలు మాత్రమే తరలించే సామర్థ్యం ఏపీకి ఉండగా, కేసీఆర్ పదేండ్ల పాలనలో అది రోజుకు 13.17 టీఎంసీలకు పెరిగిందన్నారు. పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి, వెలిగొండ, కేసీ కెనాల్, ఆర్డీఎస్ కుడి కాలువ, రాయలసీమ లిఫ్ట్‌లను ఏపీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసుకుంటుంటే కేసీఆర్ సర్కారు చోద్యం చూసిందని మండిపడ్డారు.
299 టీఎంసీలకు సంతకంతో తెలంగాణ గొంతు కోసిన్రు
2015 జూన్ 26న కేంద్ర మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్, హరీశ్ రావు, చంద్రబాబు, దేవినేని ఉమతో కూర్చుని తెలంగాణ గొంతు కోశారని సీఎం ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లోని 811 టీఎంసీల్లో 71 శాతం పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉందని, కనీసం 575 టీఎంసీలు రావాల్సి ఉండగా ఏపీకి 512 టీఎంసీలు (రాయలసీమకు 144.70, కోస్తాకు 367.34) కట్టబెట్టి, తెలంగాణకు 299 టీఎంసీలకే సంతకం పెట్టింది కేసీఆరేనని అన్నారు. 2020 జనవరి 29న కేఆర్ఎంబీ భేటీలోనూ బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే దాకా ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం నిష్పత్తి కొనసాగించేందుకు తెలంగాణ ఈఎన్సీతో సంతకం పెట్టించారని రికార్డులు చూపించారు. కేసీఆర్ చేసిన ఈ చారిత్రక తప్పిదం వల్లే ఇప్పుడు సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్‌లో ‘తెలంగాణే 512 టీఎంసీలకు ఒప్పుకుంది, ఇప్పుడు అభ్యంతరం చెప్పే హక్కు లేదు’ అంటూ ఏపీ వాదిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్లలో 11 వేల కోట్లు.. మేం 34 నెలల్లోనే 6,767 కోట్లు
జూరాల దగ్గర 22 పంపులతో రూ.35 వేల కోట్లతో పూర్తయ్యే పాలమూరు–రంగారెడ్డిని కమీషన్ల కోసం రీడిజైన్ పేరుతో శ్రీశైలానికి మార్చి, పంపులను 37కు పెంచి, అంచనాలను రూ.80 వేల కోట్లకు పెంచారే తప్ప పదేండ్లలో పూర్తి చేయలేదని సీఎం అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండిని పదేండ్లు ఎందుకు పెండింగ్‌లో పెట్టారని నిలదీశారు. 2014 జూన్ నుంచి 2023 నవంబర్ వరకు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ సర్కారు పెట్టింది రూ.11,255 కోట్లే (ఏడాదికి సగటున రూ.1,184 కోట్లు) అని, తాము 34 నెలల్లోనే రూ.6,767 కోట్లు (ఏడాదికి సగటున రూ.2,417 కోట్లు) ఖర్చు చేశామని చెప్పారు.
పదేండ్లలో కాంట్రాక్టర్లకు రూ.2.20 లక్షల కోట్ల బిల్లులు చెల్లించిన కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు 45 వేల ఎకరాలు అవసరం కాగా, బీఆర్ఎస్ పదేండ్లలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్కు రూ.3,315 కోట్లే పెట్టిందని, తాము ప్రత్యేక ల్యాండ్ అక్విజిషన్ విభాగం పెట్టి 34 నెలల్లోనే రూ.3,518 కోట్లతో 14,519 ఎకరాలు సేకరించామని, ఉద్దండాపూర్ నిర్వాసితులకే రూ.600 కోట్లకు పైగా పరిహారం ఇచ్చామని, మక్తల్–నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్‌కు 4,250 ఎకరాలు సేకరించామని తెలిపారు. 2023–24లో (కేసీఆర్ చివరి ఏడాది) ఏపీ 208.79 టీఎంసీలు వాడితే తెలంగాణ 119 టీఎంసీలే వాడిందని, తమ హయాంలో 2024–25లో 285.17, 2025–26లో 268.17 టీఎంసీలు వాడుకున్నామని చెప్పారు. ఎల్‌నినో కరువున్న ఈ ఏడాది ఈ నెల 20 నాటికి ఏపీ 132 టీఎంసీలు వాడితే తెలంగాణ 110 టీఎంసీలు (45.44 శాతం) వాడుకుందని, కేసీఆర్ ఒప్పుకున్న 34 శాతం కంటే ఎక్కువే కాపాడుకున్నామని అన్నారు.
మేడిగడ్డలో బాంబులా? బుర్ర మోకాల్లో ఉందా?
మేడిగడ్డ కుంగుబాటుపై బీఆర్ఎస్ బాంబుల ఆరోపణలను సీఎం ఎండగట్టారు. ‘భూమిలో బాంబులు పెట్టి పేల్చితే శకలాలు గాల్లోకి ఎగురుతాయా, భూమిలోకి కుంగిపోతాయా? మీ బుర్ర మోకాల్లో ఉందా, అరికాళ్లలో ఉందా?’ అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, పోలీసు దర్యాప్తు, జ్యుడీషియల్ కమిషన్ విచారణల్లో ఎక్కడా బాంబుల ఆనవాళ్లు లేవని, ఇసుక మేటల మీద సామర్థ్యం లేని పునాదులతో కట్టడం వల్లే పిల్లర్లు కుంగాయని తేలిందన్నారు. మేడిగడ్డ అనగానే అవినీతి గుర్తొస్తుందనే భయంతోనే హరీశ్ ‘కన్నెపల్లి పంప్‌హౌస్’ అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర 150–152 మీటర్ల ఎత్తుతో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ఉంటే గ్రావిటీతో ఎల్లంపల్లి దాకా ఒక్క రూపాయి కరెంట్ బిల్లు లేకుండా నీళ్లు పారేవని, కానీ కమీషన్ల కోసమే మేడిగడ్డకు మార్చి మూడంచెల లిఫ్టులు పెట్టి ఏటా రూ.10 వేల కోట్ల కరెంట్ బిల్లు భారం ప్రజలపై మోపారని ఆరోపించారు. మేడిగడ్డ గేట్లు తెరిచి ఉంచితే గోదావరి నీళ్లన్నీ పోలవరానికి పోతున్నాయనే ప్రచారాన్ని ఖండిస్తూ, ఆ నీళ్లు తుపాకులగూడెం (సమ్మక్కసాగర్)/దేవాదుల దగ్గర 47 టీఎంసీలు ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉందని, ఆ తర్వాత సీతారామ ద్వారా ఒడిసిపడుతున్నామని, ఈ మూడూ దాటాకే మిగులు జలాలు పోలవరం వైపు పోతాయని వివరించారు.
దొంగే ఆర్బీఐ తాళాలు అడిగినట్లు
కేసీఆర్ కుటుంబం మూడు తరాలు, పది తరాలు కూర్చుని తిన్నా తరగనంత సంపదను కమీషన్ల రూపంలో దోచుకోవడానికే రీడిజైన్ల నాటకం ఆడిందని సీఎం నిప్పులు చెరిగారు. ‘దొంగే స్వయంగా వచ్చి రిజర్వ్ బ్యాంక్ తాళాలు అడిగినట్లుంది హరీశ్ తీరు. ప్రాజెక్టులు కట్టిందీ మీరే, కూలగొట్టిందీ మీరే. మళ్లీ మీ చేతికే తాళాలు ఇవ్వాలా?’ అని ఎద్దేవా చేశారు. ‘హరీశ్‌కు అంత తెలివే ఉంటే సొంత మామ కేసీఆరే ఆయనను మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు? నిన్ను నీ మామే నమ్మనప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి?’ అని ప్రశ్నించారు. ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుంది వీళ్ల వ్యవహారం’ అని అన్నారు. ఏబీసీడీలు రానోళ్లను, బర్రెల కాడ ఉండేటోళ్లను మేడిగడ్డకు తోలుకెళ్లి సెల్ఫీలు దిగి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ‘ఫామ్‌హౌస్‌లో పడుకున్న దొర ఎప్పుడు లేస్తే అప్పుడే ఊరికి తెల్లారిందనుకుంటడు. అర్ధరాత్రి మెలకువ రాగానే సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేదంటడు. అర్ధరాత్రి సుప్రీంకోర్టు తెరిచి ఉంటదా? శని, ఆదివారాలు సెలవులు ఉండవా?’ అని ఎద్దేవా చేశారు. అధికారిక రికార్డులు పరిశీలించి ప్రజలకు నిజాలు చెప్పాలని, ‘జల దొంగల’ ప్రచారానికి సహకరించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ఆరు నెలల్లో 575 టీఎంసీలు సాధిస్తం
తెలంగాణ నీటి హక్కుల కోసం రాజకీయంగా, పరిపాలనాపరంగా, న్యాయపరంగా పోరాడుతున్నామని సీఎం చెప్పారు. ప్రధాని మోదీని రెండుసార్లు, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చామని, సరిహద్దు ప్రాజెక్టుల అనుమతుల కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సీఎంలను స్వయంగా రెండుసార్లు కలిశానని తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీల వాటాను రాబోయే 6 నుంచి 8 నెలల్లో దక్కించుకునేలా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వంటి నిపుణులతో నిరంతరం సమీక్షిస్తూ బలంగా వాదిస్తున్నామని చెప్పారు. 20 ఏండ్లుగా సాగుతున్న ట్రిబ్యునల్ వివాదాన్ని త్వరగా కొలిక్కి తెచ్చి రైతులకు శాశ్వత న్యాయం చేయడమే లక్ష్యమన్నారు.
సాగర్ పనులు 1.8 టీఎంసీలే: ఉత్తమ్
సాగర్ కుడి కాలువ వైపు ఏపీ చేపట్టిన పనుల సామర్థ్యం 1.8 టీఎంసీలేనని, బీఆర్ఎస్ నేతలు 90 టీఎంసీలంటూ పచ్చి అబద్ధాలతో ప్రజలను భయపెడుతున్నారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సాగర్ ఎడమ కాలువ కింద వంద శాతం ఆయకట్టుకు నీరిచ్చి రికార్డు స్థాయిలో వరి పండించామని, ఎల్‌నినో వేళ కూడా ఒక్క ఎకరం ఎండకుండా కాపాడామని చెప్పారు. కేఆర్ఎంబీకి, కేంద్ర జలశక్తి శాఖకు, ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసి అక్రమ పనులు ఆపించామని, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సిద్దిపేటలో హరీశ్‌కు చుక్కలు చూపిస్త
చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
మీడియా సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన చిట్‌చాట్‌లో రాజకీయ ప్రత్యర్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లమ్మ గుడి వద్ద ప్రమాణం చేయాలని తాను సవాల్ విసిరితే, హరీశ్ రావు అక్కడికి వెళ్లి సదర్ డ్యాన్స్ చేశారే తప్ప ప్రమాణం చేయలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో కామారెడ్డిలో మామ కేసీఆర్‌కు చుక్కలు చూపించినట్లే, రాబోయే రోజుల్లో హరీశ్ రావుకు కూడా సిద్దిపేటలో చుక్కలు చూపిస్తానని అన్నారు. అలాగే రాజగోపాల్ రెడ్డిని ఒక్కసారి వదిలేద్దామని తాను ఎప్పుడూ అనలేదని, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్‌కు 2022 ఫిబ్రవరి 16నే జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 56 ఇచ్చింది. అప్పటి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి తాగునీటి కోసం రూ.1,200 కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టారు. ఏపీలోని 13 జిల్లాల్లో తాగునీటి కోసం రూ.17,989.32 కోట్ల పనులకు ఏపీ జీవో ఇచ్చినప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ నిద్రపోయారా? కేఆర్ఎంబీకి గానీ, కేంద్ర జలశక్తికి గానీ ఎందుకు ఒక్క లేఖ అయినా రాయలేదు? 2022 ఫిబ్రవరి 24న జీవో ఆర్టీ 482 ద్వారా సాగర్ నుంచి ప్రకాశం జిల్లాకు 0.22 టీఎంసీల తాగునీటి పైప్‌లైన్ కోసం రూ.50.13 కోట్లతో ఏపీ పనులు చేపట్టినా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి విందులు ఆరగించినప్పుడు, రాయలసీమకు వెళ్లి రొయ్యల పులుసు తిన్నప్పుడే ఈ రహస్య ఒప్పందాలన్నీ జరిగాయి.
- సీఎం రేవంత్‌రెడ్డి
