ఆరు దశల్లో ఇంటర్ బోర్డు విలీనం? ..2030 నాటికి వంద శాతం కే-12 విధానమే లక్ష్యం

ఆరు దశల్లో ఇంటర్ బోర్డు విలీనం? ..2030 నాటికి వంద శాతం కే-12 విధానమే లక్ష్యం
  • టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్తగా ‘సీనియర్ సెకండరీ బోర్డు’
  • ఇంటర్ చట్టం–1971 రద్దు.. విద్యా చట్టం–1982కు సవరణ
  • 430 సర్కారు జూనియర్ కాలేజీలు స్కూళ్లలో విలీనం

 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దశాబ్దాలుగా వేర్వేరుగా కొనసాగుతున్న స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్ రెడీ అవుతోంది. ఇంటర్ బోర్డును స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌లో ఆరు దశల్లో విలీనం చేసి, 2030 నాటికి కేజీ నుంచి 12వ తరగతి వరకు 
(కే–12) వంద శాతం ఏకీకృత విద్యా విధానాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి మిన్నీ మాథ్యూ నేతృత్వంలోని కోర్ గ్రూప్–5 కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విలీన ప్రక్రియకు ఇప్పుడు ఈ నివేదికే కీలకంగా మారింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా చట్టాల్లో సమూల మార్పులు చేయాలని కమిటీ సూచించింది.

టెన్త్ ఇంటర్ పరీక్షలకు ఒకే బోర్డు

విలీనం తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షల కోసం స్వయం ప్రతిపత్తి గల సీనియర్ సెకండరీ బోర్డు (ఎస్ఎస్‌‌‌‌బీ) ఏర్పాటవుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి రిపోర్ట్ చేసే క్యాడర్ పోస్ట్ అధికారి బోర్డు సెక్రటరీగా ఉంటారు. ‘ఎగ్జామ్ వింగ్–1’ టెన్త్ పరీక్షలు, మూల్యాంకనం, సర్టిఫికెట్లు, ‘ఎగ్జామ్ వింగ్–2’ 11, 12 తరగతుల పరీక్షలు చూస్తాయి. కాలేజీల అఫిలియేషన్లు, ఈక్వివలెన్స్, గవర్నింగ్ బాడీ వ్యవహారాలను ‘స్టాట్యుటరీ అండ్ అకడమిక్ వింగ్’ పర్యవేక్షిస్తుంది.

జూనియర్ కాలేజీల విలీనం ఇలా..

మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు కలిపి దాదాపు 1,140 సంస్థల్లో ఇప్పటికే ఇంటర్ వరకు చదువు ఉంది. మిగిలిన 430 సర్కారు జూనియర్ కాలేజీలను దశలవారీగా కాంపోజిట్ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్చాలని ప్రతిపాదించారు. 2027–28లో ఫేజ్–1లో జడ్పీ హైస్కూళ్లతో ఒకే ప్రాంగణంలో ఉన్న కాలేజీలను కలిపేస్తారు. 2028–30 మధ్య ఫేజ్–2లో మిగతా వాటిని అనుసంధానం చేస్తారు. కిలోమీటర్ లోపు దూరంలో ఉన్న 260 కాలేజీలను సమీప హైస్కూళ్లతో కలిపి ఒకే సీనియర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ‘ట్విన్ క్యాంపస్’గా, ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని 55 కాలేజీలను క్లస్టర్ (హబ్–స్పోక్) మోడల్‌‌‌‌లో నడుపుతారు. ఐదు కిలోమీటర్లకు మించి దూరంలో ఉండి మంచి భవనాలున్న 19 కాలేజీలను దగ్గర్లోని హైస్కూళ్లతో అనుసంధానించి క్రమంగా టీజీపీఎస్‌‌‌‌లుగా అప్‌‌‌‌గ్రేడ్ చేస్తారు. ఇప్పటికే ఒకే క్యాంపస్‌‌‌‌లో 6 నుంచి 10వ తరగతి నడుపుతూ 12వ తరగతి వరకు విస్తరించేందుకు ఆసక్తి చూపే దాదాపు 450 ప్రైవేట్ కాలేజీలకు మొదటి ఏడాదిలోనే ఫాస్ట్–ట్రాక్ కాంపోజిట్ అఫిలియేషన్ ఇస్తారు. ఇందులో ఎన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందనేది త్వరలో విడుదలయ్యే ముసాయిదా మార్గదర్శకాలతో తేలనుంది.

కమిషనర్ చేతికే అన్ని పవర్స్

ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ), డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (డీఐఈ) అధికారాలన్నీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌కు బదిలీ అవుతాయి. విద్యాశాఖ కార్యదర్శి పాలన, క్యాడర్ నియంత్రణ అధిపతిగా ఉంటారు. కమిషనర్ పరిధిలో లోకల్ బాడీ స్కూళ్లు, సీనియర్ సెకండరీ స్కూళ్లు (సర్కారు జూనియర్ కాలేజీలు), కాంపోజిట్ కే–12 మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు, లైబ్రరీలు, ఎస్‌‌‌‌సీఈఆర్టీ, టాస్, వయోజన విద్య వంటి ఆరు ప్రధాన వింగ్స్ పనిచేస్తాయి.

ఆరు దశలు ఇవీ..

1. 55 ఏండ్ల నాటి ఇంటర్మీడియట్ విద్యా చట్టం–1971ను ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీ బిల్లు ద్వారా రద్దు చేసి, 11, 12 తరగతులను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తెచ్చేలా తెలంగాణ విద్యా చట్టం–1982కు సవరణలు.
2. పరీక్షల కోసం స్వయం ప్రతిపత్తి గల సీనియర్ సెకండరీ బోర్డు ఏర్పాటు.
3. ఆర్థిక శాఖ పోర్టల్ (ఐఎఫ్ఎంఐఎస్)లో బడ్జెట్, డీడీవో కోడ్‌‌‌‌లను సీనియర్ సెకండరీ విభాగానికి మార్చడం.
4. జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో) బాధ్యతలు జిల్లా విద్యాధికారి (డీఈవో) పరిధిలోకి.
5. 430 సర్కారు జూనియర్ కాలేజీలను రెండు విడతల్లో స్కూళ్లలో విలీనం.
6. ప్రైవేట్ కాలేజీలను మూడేండ్లలో దశలవారీగా సీనియర్ సెకండరీ విధానంలోకి మార్పు.