- దేశంలోనే అతిపెద్ద ఎక్స్పోగా నిర్వహణ
- వెయ్యికి పైగా కంపెనీల భాగస్వామ్యం
- ఫ్యూచర్ సిటీలో 80 వేల చ.మీ.లో సమిట్
- ఎంట్రీకి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ..
- సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రపంచస్థాయి పారిశ్రామిక దిగ్గజాలు, 1,500 మంది సీఈవోలు, వెయ్యికిపైగా అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’ను దేశంలోనే అతిపెద్ద మల్టీ సెక్టార్ ఎక్స్పోగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ సమిట్ జరగనున్నది. దీనికి 1,500 మంది సీఈవోలు, ఎండీలు, విదేశీ రాయబారులు, మరో 1,500 మంది పారిశ్రామిక ప్రముఖులు హాజరుకానున్నారు. అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంట్రీ పాయింట్ల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ప్రవేశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రి డి.శ్రీధర్ బాబు, సీఎస్ సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్ రంజన్, నవీన్ మిట్టల్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషితో కలిసి సీఎం సమిట్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపే బాధ్యతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుకు అప్పగించారు. వేదిక వద్ద 30 ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ వైభవం చాటేలా పెవిలియన్లు
తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కాకతీయుల శిల్పకళ, సమ్మక్క-సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, జీఐ గుర్తింపు పొందిన చేనేత ఉత్పత్తులతోపాటు గాంధీ సరోవర్ వంటి భవిష్యత్ ప్రణాళికలను ప్రదర్శించాలని చెప్పారు. రక్షా ఎక్స్‌పోలో భాగంగా డిసెంబర్ 7న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించే ఎయిర్ షోను ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎడ్యుకేషన్, క్లైమేట్, గేమింగ్‌పై ప్రత్యేక సదస్సులు
క్లైమేట్ కాంక్లేవ్‌లో సద్గురు జగ్గి వాసుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలతో గ్రీన్ ఎకానమీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇండియా జాయ్ కాంక్లేవ్‌లో అడోబ్, సోనీ, ఉబిసాఫ్ట్ సహా 150 ప్రముఖ యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ సంస్థలు పాల్గొననున్నాయి. ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో యూకే, యూరోపియన్ పెవిలియన్లతోపాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఐఎస్బీ, ఐఐటీ హైదరాబాద్, నల్సార్, హెచ్‌సీయూ ప్రతినిధులు పాల్గొంటారు. డిసెంబర్ 7న ‘స్కూల్స్ ఆఫ్ ది ఫ్యూచర్’, డిసెంబర్ 8న ‘రీఫార్మ్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్’ అంశాలపై జరిగే చర్చల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సమిట్ ముగిసిన తర్వాత డిసెంబర్ 10 నుంచి 13 వరకు సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఔత్సాహికులు ఎక్స్పోను సందర్శించే అవకాశం కల్పించనున్నారు.
