- త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌లో ఏపీ, కృష్ణా బోర్డు
- పేపర్లో వార్త చూసే దాకా తెలియదని వాదన
- రూరల్ వాటర్ సప్లై విభాగం కడుతోందన్న ఏపీ
- సాగునీటి ప్రాజెక్టు కాదు.. తాగునీటిదేనన్న బోర్డు
- చర్చ వద్దు.. బోర్డు మీటింగ్‌లో తేల్చుకోవాలని సూచన
- తాగునీటికి 9 టీఎంసీలు అడిగి.. ఇప్పుడు 19 కావాలంటూ ఏపీ మెలిక
- కృష్ణా డెల్టాకు సాగర్ నుంచి 10 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్
- ఒక్క చుక్క ఇయ్యం.. పులిచింతల నుంచి తీసుకోవాలన్న తెలంగాణ
- సాగర్ డెడ్ స్టోరేజీలో 31 టీఎంసీలు పంచుకుందామన్న ఏపీ
- ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తిరస్కరించిన తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఏపీ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వాళ్లకే తెలియదట! ఇదీ త్రీ మెంబర్ కమిటీ మీటింగ్‌లో ఇటు కృష్ణా బోర్డుతో పాటు స్వయంగా ప్రాజెక్టునే కడుతున్న ఏపీ కూడా వింత సమాధానం చెప్పింది. సోమవారం జలసౌధ వేదికగా కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ నేతృత్వంలో త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. తాగు నీటి అవసరాల పేరిట మీటింగ్ పెట్టించిన పొరుగు రాష్ట్రాన్ని.. తెలంగాణ అధికారులు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కడిగిపారేశారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టును చేపడుతున్నారని, ఇటు తమకుగానీ, అటు బోర్డుకుగానీ కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును వెంటనే నిలుపుదల చేయాలని తేల్చి చెప్పారు. తెలంగాణ లేవనెత్తిన అంశంపై ఏపీ అధికారులు చెప్పిన మాట విని మన అధికారులు కంగుతిన్నారు. సాగర్ రిజర్వాయర్‌లో కడుతున్న ఆ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ గురించి తమకు తెలియదని, సమాచారం లేదని ఏపీ ఈఎన్సీ చెప్పారు.
అది రూరల్ వాటర్ సప్లై స్కీమ్ విభాగం వాళ్లు చేపడుతున్నారని, వాళ్లే జీవో ఇచ్చారని చెప్పారు. పత్రికల్లో చూస్తేనే తెలిసిందంటూ బోర్డు ముందు వాదించారు. ఇక్కడ ఒక్క చోటే కట్టడం లేదని, పలు రిజర్వాయర్లలోనూ పనులు జరుగుతున్నాయంటూ సమర్థించుకున్నారు. దానికి తెలంగాణ అధికారులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంత పెద్ద ఇంటర్ స్టేట్ ప్రాజెక్టులో నిర్మాణాలు జరుగుతున్నా ఇరిగేషన్ శాఖకు తెలియకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. అన్నీ తెలిసే చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ జోక్యం చేసుకుని.. ఈ ప్రాజెక్టు గురించి తమకూ తెలియదన్నారు. అది సాగు నీటి ప్రాజెక్టు కాదని, తాగునీటి ప్రాజెక్టేనని చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి చర్చించేందుకు ఇది వేదిక కాదని, నేరుగా బోర్డు మీటింగ్‌లోనే తేల్చుకోవాలంటూ రెండు రాష్ట్రాలకు సూచించారు. దీంతో వీలైనంత త్వరగా బోర్డు మీటింగ్‌ను నిర్వహించాలంటూ తెలంగాణ ఈఎన్సీ డిమాండ్ చేశారు. తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో పాటు రెండు రాష్ట్రాల ఇంటర్ స్టేట్ అధికారులు హాజరైన త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ నాలుగు గంటలకుపైగా సాగింది. ఉదయం 11.30 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఒక విడత జరిగింది. తాగునీటిపై ఏదీ తేలకపోవడంతో లంచ్ బ్రేక్ తర్వాత 3.30 గంటల నుంచి మరో గంటన్నర పాటు సాగింది. ఏపీ అడిగిన డిమాండ్లకు మన రాష్ట్రం ఒప్పుకోకపోవడంతో.. ఎటూ తేలకుండానే సమావేశం ముగిసింది. దీంతో పల్నాడు అంశం, తాగునీటి అవసరాలపై బోర్డు మీటింగ్‌ను నిర్వహించాలని మెంబర్ సెక్రటరీ నిర్ణయించారు. దీనిపై బోర్డుకు మన ఈఎన్సీ కూడా లేఖ రాయాలని నిర్ణయించారు.
పులిచింతలలో నీళ్లున్నా.. సాగర్ పైనే గురి..
ఇన్నాళ్లూ శ్రీశైలం నీటిని దోచుకెళ్లిపోయిన పొరుగు రాష్ట్రం ఏపీ.. ఇప్పుడు సాగర్ నీటిపైనా కన్నేసింది. తన రిజర్వాయర్లలోకి నీటిని తరలించుకుని కడుపు నింపుకొని ఇప్పుడేమో తెలంగాణ కడుపు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. పులిచింతల, పట్టిసీమల్లో పుష్కలంగా నీళ్లున్నా.. సాగర్ నుంచి కూడా నీళ్లు కావాలంటూ తొండి చేస్తున్నది. కృష్ణా డెల్టాకు ఇప్పటికే పట్టిసీమ నీటిని తరలించిన పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు సాగర్ నీటినీ కేడీఎస్‌కు కేటాయించాలని డిమాండ్ చేసింది. డెడ్‌స్టోరేజ్ నీళ్లనూ పంచేసుకుందామంటూ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఏపీ పెట్టిన ప్రతిపాదనలన్నింటికీ తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా నో చెప్పేసింది. ఏపీ ప్రతిపాదనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ మీటింగ్‌లో ఇప్పటికే పెట్టిన 9 టీఎంసీల ఇండెంట్‌తో పాటు కృష్ణా డెల్టాకు అదనంగా మరో 10 టీఎంసీల నీళ్లు కావాలని ఏపీ గొంతెమ్మ కోర్కె కోరింది. అంతేగాకుండా 510 అడుగుల నుంచి 490 అడుగుల మధ్య డెడ్ స్టోరేజ్‌లో 31 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, ఆ నీళ్లను కూడా పంచుకుని వాడుకుందామంటూ బోర్డు ముందు ప్రతిపాదన పెట్టింది. 510 నుంచి 500 అడుగుల మధ్య 16 టీఎంసీలు, 500 నుంచి 490 అడుగుల మధ్య మరో 15 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని వాదించింది. ఏపీ ప్రతిపాదనను ఇటు తెలంగాణతో పాటు అటు కృష్ణా బోర్డు కూడా తిరస్కరించాయి.
నింద తెలంగాణపైకి
కేడీఎస్‌కు సాగర్ నీళ్లు తమ హక్కు అంటూ ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి అడ్డంగా వాదించారు. పట్టిసీమ నుంచి నీళ్లు తరలించుకుంటూనే సాగర్ నీళ్లూ ఇవ్వాలంటూ వితండ వాదనలకు దిగారు. పట్టిసీమ నుంచి ఇప్పటికే 70 టీఎంసీలకు పైగా నీళ్లు తీస్కపోయిన ఏపీ, అసలు డెల్టాకు నీళ్లే విడుదల చేయలేదంటూ బుకాయించింది. పట్టిసీమ, శ్రీశైలం నుంచి నీళ్లు ఎక్కువ వాడేసుకున్న పొరుగు రాష్ట్రం, ఆ నిందను తెలంగాణపైకి నెట్టింది. తెలంగాణే ఎక్కువ నీళ్లు డ్రా చేసిందని, అందుకే తమకు ఇబ్బందులు వస్తున్నాయంటూ బుకాయించింది.
మీ దగ్గరే 29 టీఎంసీలున్నయ్..సాగర్ చుక్క ఇయ్యం
సాగర్ కాల్వల నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు నీళ్లు తీసుకుంటామన్న ఏపీ ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే పట్టిసీమ, శ్రీశైలం నుంచి అవసరానికి మించి నీళ్లు వాడుకుని, మళ్లీ సాగర్ నీళ్లను కేడీఎస్‌కు మళ్లించడమేంటని నిలదీశారు. కేడీఎస్ కింద ఇప్పటికే 74.38 టీఎంసీలు వాడేసుకున్నారని చెప్పారు. పులిచింతలలో ఇంకా 26.75 టీఎంసీలు, కృష్ణా దిగువన 2.44 టీఎంసీలు కలిపి 29 టీఎంసీలు ఏపీ దగ్గరే ఉన్నాయని, డెల్టాకు అవసరమైతే అక్కడి నుంచే తీసుకోవాలని, సాగర్ నుంచి చుక్క కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. కృష్ణా నదిలో సహజంగా పారే (ఫ్రీ ఫ్లో) నీళ్లనే డెల్టాకు వాడుకోవాలి తప్ప, ఏ ప్రాజెక్టు నుంచీ తీసుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు (పేజీ 111) స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు.
డెడ్ స్టోరేజీ ఎమర్జెన్సీకే
ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నీళ్లను వాడుకుంటామని అనడమేంటని రమేశ్ బాబు మండిపడ్డారు. మినిమమ్ డ్రా డౌన్ లెవెల్‌ను అత్యవసర పరిస్థితుల కోసమే పెట్టారు తప్ప ఇష్టమొచ్చినట్లు వాడుకోవడానికి కాదన్నారు. సాగర్‌లో ఇప్పుడున్న నీళ్లన్నీ తెలంగాణవేనని చెప్పారు. ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి ఎగువన 45 టీఎంసీలు ఉండగా, ఆవిరి నష్టాలు 5 టీఎంసీలు పోతే మిగిలేది 40 టీఎంసీలేనని తెలిపారు. ఎండాకాలం వరకు తెలంగాణకు తాగునీటి అవసరాలే 33 టీఎంసీలు ఉన్నాయని, ఫిబ్రవరి వరకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు, హైదరాబాద్ సహా ఏఎమ్మార్పీ ద్వారా 6 టీఎంసీలు అవసరమని బోర్డుకు వివరించారు. సాగర్‌లో తెలంగాణకు 281 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, ఈ ఏడాది వరదల్లో రెండు రాష్ట్రాలు ఇప్పటికే 64 టీఎంసీలు వాడుకున్నాయని, ఇప్పుడున్న నీళ్లు తమకే అవసరమని తేల్చిచెప్పారు.
