భోపాల్: మధ్యప్రదేశ్ అమర్‌కంటక్‌లోని నర్మదా ఆలయంలో ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య ఒక భక్తుడు ఇరుక్కుపోయాడు. విగ్రహం కింద నుంచి దూరి వెళ్తే కోరికలు తీరుతాయనే నమ్మకంతో భక్తులు ఇలా చేస్తుంటారు. అందుకే ఈ భక్తుడు కూడా ఏనుగు విగ్రహం కాళ్ల కింద దూరి బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ.. ఇరుక్కుపోయి ఇబ్బందిపడ్డాడు. తోటి భక్తులు చాలా సేపు నానా తంటాలు పడి ఆ భక్తుడిని ఎట్టకేలకు క్షేమంగా బయటపడేశారు.
భక్తితో వెళ్లి.. ఇరుక్కుపోయి తంటాలు! ఏనుగు విగ్రహం మధ్యలో ఇరుక్కున్న భక్తుడు! మధ్యప్రదేశ్ అమర్కంటక్లో విచిత్ర ఘటన మా నర్మదా ఆలయ ప్రాంగణంలో ఘటన విగ్రహం మధ్య నుంచి బయటకు రాలేక అవస్థలు! ఎలాగోలా బయటపడ్డ భక్తుడు https://t.co/2QlrWqAI9L
— V6 News (@V6News) November 23, 2026
ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఇతర భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి వెళ్లడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆలయ ప్రాంగణంలో నల్లటి రాతితో చేసిన ఏనుగు, గుర్రం విగ్రహాలు ఉన్నాయి. ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి దూరి అవతలి వైపునకు వెళ్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కొందరు భక్తులు దీనిని తమ పుణ్య పాపాలకు పరీక్షగా భావిస్తారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయంలో స్పష్టత లేదు.
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో ఇలాంటి ఘటనే జరిగి ఏపీకి చెందిన ఒక భక్తుడు చనిపోయిన ఘటన గుర్తుండే ఉంటుంది. రాజమండ్రికి చెందిన మణికుమార్ (36) జూలై 24, 2026 రాత్రి కుటుంబంతో కలిసి గిరిప్రదక్షిణ చేస్తూ ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయంలోని మోక్ష మార్గంలోకి ప్రవేశించాడు.
అత్యంత ఇరుకైన గుహలాంటి మార్గంలో చిక్కుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి స్పృహ కోల్పోయాడు. భక్తులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత ఆలయ అధికారులు అధిక బరువు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారికి ప్రవేశంపై ఆంక్షలు విధించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
