హ్యాండ్ పంప్ కొడితే మందొస్తుంది !: ఎట్లొస్తయ్ రా ఇలాంటి ఐడియాలు

హ్యాండ్ పంప్ కొడితే మందొస్తుంది !: ఎట్లొస్తయ్ రా ఇలాంటి ఐడియాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో అక్రమ మద్యం విక్రయానికి సంబంధించి ఒక వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. భూగర్భ ట్యాంకుల్లో నిల్వ చేసిన నాటు సారాను హ్యాండ్ పంప్‌ల ద్వారా బయటకు తీసి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటన పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఝాన్సీ జిల్లాలోని సక్రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబుత్రా డెరాలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా నాటు సారా బట్టీలపై  దాడులు చేశారు.

అక్రమ మద్యం తయారీ, విక్రయాల నిర్మూలనకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం ఈ సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల సమయంలో మద్యం తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు వెయ్యి లీటర్ల ‘లాహన్’ (పులియబెట్టిన ద్రవం)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం, సంబంధిత అధికారుల సమక్షంలోనే ఆ ద్రవాన్ని అక్కడికక్కడే పారపోశారు.

ఈ నాటు సారా ముఠా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న ఈ దందా గురించి సక్రార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) పప్పు సింగ్ వివరాలు వెల్లడించారు. "నిందితులు అక్రమంగా మద్యం తయారు చేసి, దానిని భూమి లోపల నిర్మించిన రహస్య ట్యాంకుల్లో నిల్వ చేసేవారు. ఆ ట్యాంకులకు పైపుల ద్వారా హ్యాండ్ పంప్‌లను అనుసంధానించారు. ఎవరికీ అనుమానం రాకుండా హ్యాండ్ పంప్ కొట్టి సారాను బయటకు తీసి విక్రయించేవారు. ఈ విక్రయాలు జరిగే సమయంలో నిందితుల అనుచరులు చుట్టుపక్కల కాపలా ఉండేవారు" అని ఆయన చెప్పారు.

ఈ కేసులో తేజ్‌పూర్ ఘురాట్‌కు చెందిన వినీత అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 30 లీటర్ల అక్రమ నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ వ్యాపారంతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్న మరికొన్ని ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.