వాట్సాప్ వెబ్ ఉపయోగిస్తున్న వారు తమ అకౌంట్ సేఫ్టీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరించింది. కంప్యూటర్లలో వాట్సాప్ వాడిన తర్వాత సెషన్ నుంచి లాగౌట్ చేయకపోతే.. ఆ ఖాతాలను ఇతరులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆఫీసు కంప్యూటర్లు, ఇతరులతో షేర్ చేసే డివైజ్‌లలో వాట్సాప్ వెబ్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ఈ మేరకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయి ఉన్న సెషన్లను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆథరైజేషన్ లేకుండానే అకౌంట్లలోని ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత మెసేజ్‌లను చదవడమే కాకుండా.. వారి పేరుతో ఇతరులకు మెసేజ్ లు పంపడం, కాంటాక్ట్ వివరాలను సేకరించడం వంటి పనులు చేస్తారని వెల్లడించింది. ఖాతాదారుల గుర్తింపును దొంగిలించి ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడులకు పాల్పడే ముప్పు ఉందని ఐ4సీ తెలిపింది.
వాట్సాప్ వెబ్ సెషన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సూచనలు:
1. తప్పనిసరిగా లాగౌట్: వాట్సాప్ వెబ్‌లో పని పూర్తయిన తర్వాత ప్రతిసారీ మాన్యువల్‌గా లాగౌట్ అవ్వాలి. కేవలం బ్రౌజర్ విండోను లేదా ట్యాబ్‌ను క్లోజ్ చేస్తే సరిపోదు. అది లాగౌట్ కిందకు రాదని అధికారులు స్పష్టం చేశారు.
2. రహస్య సమాచారం వద్దు: ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ద్వారా ప్రభుత్వ సంబంధిత, ఆర్థిక, అత్యంత రహస్యమైన సమాచారాన్ని ఇతరులకు పంపవద్దని అడ్వైజరీ పేర్కొంది.
3. పబ్లిక్ కంప్యూటర్లకు దూరం: సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, విమానాశ్రయాల్లోని పబ్లిక్ కంప్యూటర్లు లేదా ఇతరుల ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ లాగిన్ అవ్వకపోవడమే మంచిది.
4. ప్రైవేట్ బ్రౌజింగ్: తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే బ్రౌజర్‌లో 'ఇంకాగ్నిటో' లేదా 'ప్రైవేట్ బ్రౌజింగ్' మోడ్ ఉపయోగించాలి. అయితే ప్రైవేట్ బ్రౌజింగ్ కేవలం హిస్టరీని మాత్రమే దాస్తుందని, సెషన్ యాక్టివ్‌గా ఉంటే ముప్పు తప్పదని ఐ4సీ హెచ్చరించింది.
5. లింక్డ్ డివైజెస్ తనిఖీ: యూజర్లు తమ మొబైల్‌లోని వాట్సాప్ సెట్టింగ్స్‌కు వెళ్లి 'లింక్డ్ డివైజెస్' ఆప్షన్‌ను అప్పుడప్పుడు తనిఖీ చేసుకోవాలి. అక్కడ మీకు తెలియని డివైజ్‌లు ఏవైనా కనిపిస్తే వెంటనే వాటిని రిమూవ్ చేయాలి.
వాట్సాప్ అకౌంట్ నుంచి ఎవరికైనా తెలియకుండా మెసేజ్‌లు వెళ్లడం, కాంటాక్ట్స్ నుంచి వింత రిప్లైలు రావడం వంటివి జరిగితే ఖాతా హ్యాక్ అయి ఉండవచ్చని అనుమానించాలని ఐ4సీ తెలిపింది. ఇటువంటి సమయాల్లో వెంటనే అకౌంట్ సెక్యూర్ చేసుకోవాలని సూచించింది. అలాగే కంప్యూటర్లలోని ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్లు, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. అనుమానాస్పద లింకులు, తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు. డిజిటల్ భద్రతలో లాగిన్ అవ్వడం ఎంత ముఖ్యమో.. సురక్షితంగా లాగౌట్ అవ్వడం కూడా అంతే ముఖ్యమని ప్రజలకు సూచించింది.
