ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్ వేగా తీర్చిదిద్దుతామని అన్నారు మంత్రి లోకేష్. సోమవారం ( నవంబర్ 23 ) ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో విశాఖలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఏషియన్- ఇండియా మారిటైం కాంక్లేవ్ లో పాల్గొన్న ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి ఈ సదస్సులో పాల్గొన్నారు లోకేష్. మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన, శాశ్వతమైన భాగస్వామ్యాలు కోరుకుంటున్నామని, సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని అన్నారు లోకేష్.
విశాఖ భారతదేశ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి నిలయమని... ఇవాళ వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ముఖ్యమైన కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఒకప్పుడు సముద్రమే మన తొలి రహదారి అని... ఇవాళ ఆధునిక నౌకాశ్రయాలు, డిజిటల్ సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం ద్వారా ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం మనకు ఉందని.. అందుకే ఈ సదస్సుకు కనెక్టివిటీ-కన్వర్జెన్స్-కోఆపరేషన్ అనే థీమ్ ను ఎంచుకోవడం జరిగిందని అన్నారు.
మారిటైం ఎకానమీకి ప్రాధాన్యత
ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం తన సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తోందని... సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కార్యక్రమాల ద్వారా మెరుగైన నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణం, రవాణా, సరుకు నిర్వహణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నామని అన్నారు.
భారత నౌకా నిర్మాణం, సముద్ర రంగాన్ని బలోపేతం చేసేందుకు దాదాపు రూ.70 వేల కోట్లతో కూడిన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని... ఇందులో రూ.25,000 కోట్ల మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఉందని అన్నారు. భారతదేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతోందని అన్నారు లోకేష్. మన ఆర్థిక అభివృద్ధికి మెరుగైన నౌకాశ్రయాలు, నౌకాయాన మౌలిక సదుపాయాలు అత్యంత అవసరమని... ప్రతి నూతన నౌకాశ్రయం పరిశ్రమలకు, వ్యాపారాలకు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు లోకేష్.
పొడవైన తీరం..ఏపీకి వరం
భారతదేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతాల్లో ఒకటైన ఏపీకి దాదాపు 1,053 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని... సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్ వేగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు లోకేష్. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించిందని... ఈ విషయంలో దాదాపు 10 శాతం వృద్ధి నమోదైందని అన్నారు.
రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో 4 నూతన పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని... ఈ పోర్టులు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ఏపీ, పొరుగు రాష్ట్రాల్లోని పరిశ్రమలకు తోడ్పాటునందిస్తాయని అన్నారు లోకేష్. దుగరాజపట్నంలో దాదాపు రూ.30వేల కోట్ల పెట్టుబడితో మేజర్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని... గత వారమే విశాఖపట్నంలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినల్స్, నౌకల మరమ్మతులు వంటి రంగాలకు సంబంధించి దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ఐదు సముద్ర రంగ అవగాహన ఒప్పందాలు కుదిరాయని అన్నారు. పోర్టులను పరిశ్రమలతో, పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు లోకేష్.
