మన బ్యాంకుల దగ్గర డబ్బులు లేవు: RBI దగ్గర అప్పులు తీసుకుంటున్నాయి

మన బ్యాంకుల దగ్గర డబ్బులు లేవు: RBI దగ్గర అప్పులు తీసుకుంటున్నాయి

దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. దాదాపు 5 నెలల తర్వాత భారత బ్యాంకుల వద్ద క్యాష్ నిల్ అయిపోవడంతో.. అవి డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. పన్నుల చెల్లింపుల రూపంలో భారీగా డబ్బు బయటకు వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది.

నవంబర్ 21 నాటికి ఆర్‌బీఐ బ్యాంకులకు రూ. 12వేల 825 కోట్లను సమకూర్చింది. జూన్ 29 తర్వాత ఆర్‌బీఐ ఇలా నిధులను విడుదల చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా.. తక్షణ నగదు కష్టాలను తీర్చేందుకు సోమవారం నాడు రెండు విడతల్లో ఏకంగా రూ. లక్ష కోట్ల భారీ మొత్తాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేసింది. ఈ నిధులు రాబోయే రోజుల్లో తిరిగి ఆర్‌బీఐకి వెళ్లేలా స్వల్పకాలిక లావాదేవీల ద్వారా సర్దుబాటు చేసింది.

నగదు కొరత కారణంగా బ్యాంకుల మధ్య జరిగే ఓవర్‌నైట్ లోన్ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ రెపో రేటు 5.50% కంటే కాల్ రేటు సుమారు 25 బేసిస్ పాయింట్లు ఎక్కువగా నమోదైంది. 2 నెలల క్రితం వరకు NRIలు ప్రత్యేక పథకం ద్వారా వచ్చిన డాలర్లతో బ్యాంకుల వద్ద రికార్డు స్థాయిలో అదనపు డబ్బు ఉండేది. కానీ క్రూడ్ ఆయిల్ ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరగకుండా సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ అదనపు నగదును వెనక్కి తీసుకోవడం, గత నెలలో దాదాపు నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది.

ALSO READ : డబ్బున్న అమ్మాయిలు వద్దంట.. చిన్న కుటుంబాల్లో నచ్చటం లేదు

రాబోయే రోజుల్లో ఈ డబ్బు కష్టాలు బ్యాంకులకు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గౌరా సేన్ గుప్తా చెప్పారు. అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో ప్రజలు బ్యాంకుల నుంచి ఎక్కువగా డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారని.. ఈ ఏడాది ఇది మరింత ఎక్కువగా ఉందని, కాబట్టి వచ్చే త్రైమాసికం వరకు బ్యాంకుల్లో క్యాష్ కొరత కొనసాగవచ్చని ఆమె అంచనా వేశారు.