హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఏసీబీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. దాదాపు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్స్, ఇతర వస్తువులను సరఫరాదారులు అల్మారాల్లో నిల్వ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నేరుగా విక్రేతల నుంచి వైద్య సిబ్బంది ఇంప్లాంట్స్ తీసుకుంటున్నారని ఏసీబీ తనిఖీల్లో స్పష్టమైంది. మెయిన్ స్టోర్‌కు ఇండెంట్ పెట్టకుండానే వినియోగం, వాడిన తర్వాత యుటిలిటీ సర్టిఫికెట్లు జారీ చేసి బిల్లింగ్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
వాడని ఇంప్లాంట్స్‌కు కూడా బిల్లులు పెట్టే అవకాశం ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. బిల్లింగ్‌లో కూడా భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత బిల్లుల ప్రాసెసింగ్ చేసి.. రోగి మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లుల ప్రాసెసింగ్ జరిగిన సందర్భాలు ఉన్నట్లు తేలింది.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డిశ్చార్జ్ అయిన రోగులకు సంబంధించి సుమారు రూ.66 లక్షల బిల్లుల నమోదు కావడం ఏసీబీ అధికారులను విస్తుపోయేలా చేసింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కేసుల్లో అక్రమాలు జరిగినట్లు, సర్జికల్ వస్తువుల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. అసాధారణంగా అధికంగా సర్జికల్ వస్తువుల వినియోగం, ఒక్క రోగికి ఒక వారంలో 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో నిమ్స్ సిబ్బంది పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది.
