Sara Tendulkar : సచిన్ కూతురి వివాహంపై బిగ్ ట్విస్ట్.. రాజ్‌వీర్ డియోల్‌తో పెళ్లి ప్రచారంపై సారా క్లారిటీ!

Sara Tendulkar : సచిన్ కూతురి వివాహంపై బిగ్ ట్విస్ట్.. రాజ్‌వీర్ డియోల్‌తో పెళ్లి ప్రచారంపై సారా క్లారిటీ!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పెళ్లి వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ తనయుడు, నటుడు రాజ్ వీర్ డియోల్ తో సారా పెళ్లి జరగబోతోందని .. అది కూడా 2027లోనే అంటూ జోరుగా ప్రచారం జరిగింది. క్రికెట్, సినీ రంగాలకు చెందిన రెండు ప్రముఖ కుటుంబాలు ఒక్కటి కాబోతున్నాయంటూ నెట్టింట కథనాలు చక్కర్లు కొట్టాయి.  అయితే ఈ వార్తలపై లేటెస్ట్ గా ఆసక్తికరమైన క్లారిటీ వచ్చింది.

సారాకు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి ఈ పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించారు. సారా, రాజ్‌వీర్ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని, ఆమె ప్రస్తుతం సింగిల్‌గా ఉంటూ తన పనిపై దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధార ప్రచారం అనవసరంగా ఇబ్బంది కలిగిస్తోందని.. సారా మాత్రం ఈ వార్తలపై స్పందించకుండా హుందాగా ఉండాలని భావిస్తోందని తెలిపారు. దీంతో 2027లో పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.

ఇదిలా ఉంటే.. గతంలో సారా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తమ్ముడు అర్జున్ టెండూల్కర్ వివాహం తనకు ఓ ట్రయల్ రన్‌లా అనిపించిందని, దాని ద్వారా తన పెళ్లిలో ఏం కావాలో, ఏం వద్దో తెలుసుకున్నానని చెప్పింది. చిన్నప్పుడు గ్రాండ్ వెడ్డింగ్, పాస్టెల్ కలర్ బ్రైడల్ లుక్ కావాలని కలలు కన్నానని.. ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చిన్న వేడుకే ఇష్టమని తెలిపింది.

అంతేకాదు.. పెళ్లికి ముందు భాగస్వామి లేదా వారి కుటుంబం గురించి అసౌకర్యంగా అనిపిస్తే బంధం నుంచి బయటకు రావడంలో తప్పులేదని ఆమె అభిప్రాయపడింది. తల్లిదండ్రుల అనుబంధాన్ని ఆదర్శంగా భావించే సారా.. తన జీవిత భాగస్వామి విషయంలోనూ స్నేహం, పరస్పర గౌరవానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు గతంలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు..