బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి వివాహ వేడుకలు పట్నా జిల్లాలోని ఆయన స్వగ్రామం లడ్మాలో ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 25న జరగనున్న ఈ పెళ్లి కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కమాండెంట్ రణవిజయ్ కుమార్ కుమారుడు రిషికేశ్ కుమార్‌తో శివాంగి వివాహం నిశ్చయమైంది.
ప్రస్తుతం వివాహ వేడుకల్లో భాగంగా హల్దీ కార్యక్రమం కొనసాగుతోంది. అతిథుల కోసం సుమారు 100 అడుగుల పొడవున్న భారీ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి విచ్చేసే అతిథుల కోసం 50 లక్షల గులాబ్ జామూన్లను సిద్ధం చేస్తున్నట్లు అనంత్ సింగ్ సన్నిహితుడు కన్హయ్య సింగ్ వెల్లడించారు. మిఠాయిల తయారీ కోసం 10 వేల కేజీల పాల ట్యాంకర్లను నేరుగా కిచెన్ దగ్గరకే తెప్పించారు. వంటల తయారీ కోసం మరో 12 టెంట్లను కూడా సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
More than 2 million rasgullas are being made for Anant Singh’s daughter’s wedding, for which 15 tankers of milk have been brought in #AnantSingh #BiharNews #NiftyIT #FoodSafety #TejRan https://t.co/sT93TcE0AP
— Priya halchal (@HalchalPriya) November 23, 2026
పెళ్లి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా గుర్రపు పందేలు నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మేలుజాతి గుర్రాలు ఇప్పటికే లడ్మాకు చేరుకున్నాయి. ఈ పందెంలో గెలిచిన వారికి ‘థార్’ కారును బహుమతిగా ప్రకటించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మైదానం బురదగా మారడంతో, పందెం కోసం గ్రౌండ్‌ను చదును చేసే పనులు జరుగుతున్నాయి. అతిథుల రాక కోసం హైవే పక్కనే ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ను కూడా నిర్మించారు.
ఈ వివాహ వేడుకల గురించి అనంత్ సింగ్ మాట్లాడుతూ.. తాము చాలా సంతోషంగా ఉన్నామని, అతిథులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. గుర్రపు పందెం కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంత్ సింగ్ కుమారులు అంకిత్, అభిషేక్, అభినవ్ అతిథులకు స్వాగతం పలుకుతున్నారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ సింగ్ ఇప్పటికే ఈ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంత్ సింగ్ తనకు సోదరుడి లాంటి వారని, రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయనను ఆహ్వానిస్తామని సుశీల్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న గుర్రపు పందెం ప్రేమికులు ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు.
