ఉత్తరప్రదేశ్లో పొత్తు రాజకీయం నడుస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య పొత్తు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఢిల్లీలో సోమవారం జరిగిన మొదటి విడత చర్చల్లో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు ఒక అవగాహనకు వచ్చారు. రాబోయే రెండు నుంచి నాలుగు రోజుల్లో దీనిపై కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో సోమవారం ఈ సమావేశం జరిగింది.
దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో కాంగ్రెస్ తన సవరించిన లిస్టును సమాజ్ వాదీ పార్టీకి అందజేసింది. యూపీలో 100 నుంచి 120 స్థానాలను కోరుతు సమాజ్ వాదీ పార్టీ ముందు కాంగ్రెస్ ప్రతిపాదన ఉంచింది. గతంలో కోరిన దానికంటే.. ఈసారి 70 నుంచి 80 సీట్లను కాంగ్రెస్ తగ్గించుకోవడం గమనార్హం. పార్టీలతో సంబంధం లేకుండా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.
పొత్తుపై చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ చెప్పారు. రెండు మూడు రోజుల్లో పొత్తు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం రెండో విడత చర్చలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన కొత్త లిస్టును పరిశీలించి ఎస్పీ తన అభిప్రాయాన్ని చెప్పనుంది. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా సాగాయని, ఒప్పందం దాదాపు ఖరారైందని చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నందున సీట్ల వివరాలను వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధన మిశ్రా మోనా మాట్లాడుతూ సీట్ల సంఖ్య ముఖ్యం కాదని, మంగళవారం నాటి భేటీతో అంతా ఖరారవుతుందని చెప్పారు.
2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు, రాహుల్ గాంధీ జాతీయ నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈసారి ఎక్కువ సీట్లు ఆశిస్తోంది. ఎస్పీ చర్చల కమిటీకి రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ లాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్రా చౌదరి సభ్యులుగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. 2027లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇరు పార్టీలు ఈ పొత్తు కుదుర్చుకుంటున్నాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2027 ఆరంభంలో ఎన్నికలు జరగనున్నాయి.
