సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్‌గూడలో తీవ్ర కలకలం రేగింది. ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌పై విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని ఇంగ్లీష్ లెక్చరర్ వేధించాడనే ఆరోపణలు ఈ ఘటనకు కారణమయ్యాయి.
విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న రవి, డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినికి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజూ తనతో చాటింగ్ చేయాలని ఒత్తిడి చేస్తూ, ఆమెను మానసికంగా వేధించినట్లు తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఈ క్రమంలో లెక్చరర్ పంపినట్లు చెబుతున్న వాట్సాప్ సందేశాలు విద్యార్థిని వద్ద ఉన్నట్లు తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు వాట్సాప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను పరిశీలించారు. అందులో రవి పంపిన మెసేజ్‌లను చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ లెక్చరర్ రవిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనతో కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లెక్చరర్‌పై విద్యార్థులు దాడి చేయడంతో కాలేజీలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. విద్యార్థిని వేధింపులకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణలు, వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లు తదితర అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై ప్రాథమిక వివరాలను పరిశీలించిన పోలీసులు ఇంగ్లీష్ లెక్చరర్ రవిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులే ఇలా నీచంగా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాలికల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
