- లోయర్ సాక్సనీతో టాలెంట్ మొబిలిటీ భాగస్వామ్యానికి ముందడుగు
- స్కిల్ ట్రైనింగ్, నియామకాలపై మంత్రి వివేక్ వెంకటస్వామి చర్చలు
- టామ్‌కామ్‌లో లోయర్ సాక్సనీ కార్యాలయానికి ప్రభుత్వ సహకారం
- నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు రూ.50 కోట్ల బడ్జెట్
న్యూఢిల్లీ, వెలుగు:తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు అక్కడి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా జర్మనీలోని లోయర్ సాక్సనీ రాష్ట్రంతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, టాలెంట్ మొబిలిటీపై భాగస్వామ్యానికి సిద్ధమైంది. సోమవారం న్యూఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని ఈ అంశాలపై చర్చించారు. లోయర్ సాక్సనీ మినిస్టర్ ప్రెసిడెంట్ ఒలాఫ్ లీస్, భారత్‌లో జర్మనీ రాయబారి డాక్టర్ జాస్పర్ వీక్, డాక్టర్ బాల రమణితోపాటు ఇరు దేశాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ, లోయర్ సాక్సనీ మధ్య సంస్థాగత భాగస్వామ్యం, జర్మన్ పరిశ్రమల అవసరాలకు తగ్గ శిక్షణ, పారదర్శక నియామకాల ద్వారా యువతకు విదేశీ ఉద్యోగాలు కల్పించే అంశాలు చర్చకు వచ్చాయి.
పరిశ్రమలకు తగ్గ శిక్షణ..
యువతకు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే శిక్షణ కాకుండా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చి స్థిరమైన ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ తెలిపారు. తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు జర్మనీతోపాటు ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 300 ఐటీఐలు ఉన్నాయని వెల్లడించారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఇప్పటికే 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని, మరో 54 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందిస్తున్నామని వివరించారు.
ఇరు ప్రాంతాలకూ లాభం..
జర్మనీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ యువ మానవ వనరుల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జర్మనీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్లో తెలంగాణ యువతకు శిక్షణ ఇస్తే ఇరు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుందన్నారు. తద్వారా తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగాలు లభించడంతోపాటు జర్మనీకి నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం ఓఈఎస్కు బడ్జెట్ కేటాయింపు
అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్)లో లోయర్ సాక్సనీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యాలయం ద్వారా నైపుణ్య శిక్షణ, ఉద్యోగ నియామకాలు, ఇరు ప్రాంతాల సంస్థల మధ్య సమన్వయం సులభతరం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాల అమలుకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం (సీఎం ఓఈఎస్) కింద రూ.50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడం, అంతర్జాతీయ ఉద్యోగాలకు వారిని సిద్ధం చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని వివరించారు.
