వెస్ట్ బెంగాల్ కాదు.. పశ్చిమ బంగ ..రాష్ట్రం కేబినెట్ ఆమోదం

వెస్ట్ బెంగాల్ కాదు.. పశ్చిమ బంగ ..రాష్ట్రం కేబినెట్ ఆమోదం
  • ఇంగ్లిష్‌‌‌‌లోనూ ఇక ‘పశ్చిమ బంగ’నే
  • వచ్చేనెల 9న అసెంబ్లీలో తీర్మానం

కోల్‌‌‌‌కతా: వెస్ట్ బెంగాల్ పేరును ‘పశ్చిమ బంగ’గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం కోల్‌‌‌‌కతాలోని సచివాలయం నబన్నలో సీఎం సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే ఇంగ్లిష్‌‌‌‌లో కూడా ‘వెస్ట్ బెంగాల్’ బదులు ‘పశ్చిమ బంగ’ అనే పేరునే వాడుతారు. డిసెంబర్ 4 నుంచి 14 వరకు జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో, డిసెంబర్ 9న ఈ మేరకు తీర్మానం ప్రవేశపెడతామని సీఎం సువేందు ప్రకటించారు. 

‘ఇంగ్లిష్‌‌‌‌లోనూ వెస్ట్ బెంగాల్ ఇక పశ్చిమ బంగ అవుతుంది. 9న అసెంబ్లీలో తీర్మానం పెడతాం. ఆ తర్వాత అది కేంద్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి పార్లమెంట్‌‌‌‌కు వెళ్తుంది’ అని చెప్పారు. రాష్ట్రం పేరు ‘పశ్చిమ బంగ’గా మారే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఇదివరకే సంకేతాలిచ్చారు.

చరిత్రతో ముడిపడిన అంశం: సువేందు

దేశ విభజన సమయంలో 1947 జూన్ 20న పశ్చిమ బెంగాల్ ఏర్పాటుపై నిర్ణయం జరిగిందని, ఈ పేరు మార్పు ఆ చరిత్రతో ముడిపడి ఉందని సీఎం సువేందు చెప్పారు. ‘ఇది చరిత్రకు సంబంధించిన అంశం. ఈ మార్పు జరిగి తీరాలి’ అని అన్నారు.

మమత ప్రయత్నం ఫలించలే

రాష్ట్రం పేరు మార్పుపై ఏండ్లుగా చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని ప్రతిపాదించారు. అసెంబ్లీ ఆమోదించి కేంద్రహోంశాఖకు పంపినా, కేంద్రం ఆమోదం దక్కలేదు. ఇంగ్లిష్‌‌‌‌లో రాష్ట్రం పేరు ‘డబ్ల్యూ’ అక్షరంతో మొదలవడంతో జాబితాల్లో, అధికారిక సమావేశాల్లో రాష్ట్రానికి చివరి వరుసలో అవకాశం వస్తోందనేది నాటి ప్రతిపాదనకు ఓ కారణం.