హైదరాబాద్, వెలుగు: మెదక్ జిల్లా చేగుంట మండలం చెట్ల తిమ్మాయపల్లి(2001)లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 2లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తీర్పు ప్రతి అందిన 8 వారాల్లోగా ఈ మొత్తాన్ని అందజేయాలని 24 ఏండ్ల నాటి పిటిషన్‌పై ఇటీవల తీర్పు వెలువరించింది. నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న అనుమానంతో తన భర్త బాల నరసయ్యను పోలీసులు కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపిస్తూ పొన్న వెంకటమ్మకు 2001లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాధ్యులైన ఎస్సైపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని, అలాగే.. రూ. 2 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ సుద్దాల చలపతిరావు ఇటీవల విచారణ చేపట్టారు.ఎన్‌కౌంటర్ సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) మార్గదర్శకాలను పోలీసులు పాటించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.
ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామన్న పోలీసుల వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని, మేజిస్టీరియల్ విచారణ నివేదికను కూడా సమర్పించలేదని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం చట్టవిరుద్ధంగా ఎవరి ప్రాణాలనూ తీసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా ప్రయోజనం ఉండదని తీర్పు చెప్పింది.
