అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు..119వ అకడమిక్ కౌన్సిల్సమావేశంలో కీలక నిర్ణయాలు

అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు..119వ అకడమిక్ కౌన్సిల్సమావేశంలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్​వర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో రెండు కొత్త డిగ్రీ కోర్సులను ప్రారంభించాలని అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. హైదరాబాద్ ఐఐటీ, బిట్స్ సహకారంతో నాలుగేళ్ల బీటెక్ (ఏఐ ఇన్ అగ్రికల్చర్) కోర్సుతో పాటు బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ డైటెటిక్స్) కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. మార్కెట్‌‌‌‌లో పెరుగుతున్న డిమాండ్, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులను రాజేంద్రనగర్ క్యాంపస్‌‌‌‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

వీటి సిలబస్, నిబంధనల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. 119వ అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం రాజేంద్రనగర్‌‌‌‌లోని వర్సిటీ ఆడిటోరియం కమిటీ హాల్‌‌‌‌లో వైస్‌‌‌‌ చాన్స్‌‌‌‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో సమావేశం జరిగింది. యూనివర్సిటీ అధికారులు, విభాగాధిపతులు, అసోసియేట్ డీన్లతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఐసీఏఆర్-ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, ఇతర ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఎల్‌‌‌‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించి, భరోసా నింపేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయించింది. వ్యవసాయ శాఖ సహకారంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా యాత్రలు నిర్వహించనున్నారు. ఈ యాత్రల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొని వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. రైతుల్లో ఆందోళన తగ్గించి, పరిస్థితులకు అనుగుణంగా సాగు నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేస్తామని వీసీ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.