- సర్‌కు మద్దతుగా కరీంనగర్లో బీజేపీ మహాపాదయాత్ర
- చనిపోయిన 3 కోట్ల మంది ఓట్లు ఉంచాల్నా?: నితిన్ నబీన్
- చొరబాటుదారుల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వకాల్తా
- రాహుల్‌కు ఏటీఎంలా రేవంత్.. 36 నెలల్లో 82 సార్లు ఢిల్లీకి
- కరీంనగర్ గడ్డ.. కాషాయపు అడ్డా: బండి సంజయ్
- రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
కరీంనగర్, వెలుగు: తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చి ఇక్కడి యువత ఆశలు నెరవేరుస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు. సర్ ను అడ్డం పెట్టుకుని ఇండియా కూటమి నేతలు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన 3 కోట్ల మంది పేర్లను ఇంకా ఓటర్ లిస్టులోనే ఉంచాలా అని ప్రశ్నించారు. 2002 ఓటర్ లిస్టులో ఎక్కడున్నారని అడిగితే దేశంలో దాదాపు 3 కోట్ల మంది చెప్పలేకపోతున్నారని, వారి ఓట్లనే అధికారులు తొలగించారని, ఆ చొరబాటుదారులకు ఓటు హక్కు ఉండాలని కాంగ్రెస్, కూటమి నేతలు వకాల్తా పుచ్చుకుంటున్నారని విమర్శించారు. ‘లోక్తంత్ర బచావో.. అరాజకత హఠావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని తరిమికొట్టండి) నినాదంతో సర్‌కు మద్దతుగా బీజేపీ సోమవారం కరీంనగర్లో మహాపాదయాత్ర నిర్వహించింది. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి నబీన్ ప్రసంగించారు.
రాజ్యాంగం మా మనసులో ఉంది
రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటున్నారని, కానీ ప్రజలు, ప్రజల ఓట్లు తమ పక్షానే ఉన్నాయని నితిన్ నబీన్ అన్నారు. విపక్షాలు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటే, ఆ రాజ్యాంగం తమ మనసులో ఉందన్నారు. రాహుల్ గాంధీ దేశంలో ఉన్నప్పుడూ, విదేశాలకు వెళ్లినప్పుడూ దేశాన్ని అవమానిస్తూనే ఉన్నారని, ‘రాహుల్ బాబా’ నిజస్వరూపాన్ని బయటపెట్టడానికే తెలంగాణ ప్రజల మధ్యకు వచ్చానన్నారు. రేవంత్ రెడ్డి 36 నెలల్లో 82 సార్లకు పైగా ఢిల్లీ దర్బార్‌కు వెళ్లి అధిష్ఠానానికి
మోకరిల్లారన్నారు.
రేవంత్ ఎన్నిక కూడా చెల్లదు: రాంచందర్ రావు
కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు సర్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. మోదీ ఎన్నిక చెల్లదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరమని, అలాగైతే రేవంత్ రెడ్డి ఎన్నిక కూడా చెల్లదని, రేవంత్ సర్కార్‌ను రద్దు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్చార్జి అభయ్ పాటిల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ కరీంనగర్ ఇన్చార్జి భండారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ నేత ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, కప్పర హరిప్రసాద్ పాల్గొన్నారు.
కరీంనగర్ గడ్డ.. కాషాయపు అడ్డా: బండి సంజయ్
కరీంనగర్లో కాషాయ ప్రభంజనం చూసి ఈ గడ్డ ఉరకలేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ లేదంటున్న కుహనా శక్తులకు ఈ పాదయాత్రే జవాబన్నారు. ‘తెలంగాణలో అధికారం కోసం బీజేపీ కార్యకర్తలు చేస్తున్న పోరాటం మామూలుది కాదు. కాషాయ జెండా మోసి భుజాలు కాయలు కాసినా, లాఠీ దెబ్బలకు ఒళ్లంతా గీరుకుపోయినా బీజేపీ కార్యకర్త ఎన్నడూ భయపడలేదు’ అన్నారు. ‘సర్‌తో రాహుల్ గాంధీకి వచ్చిన నష్టమేంది? చచ్చిపోయిన 3 కోట్ల మంది ఓట్లను తొలగిస్తే తప్పేంది? మాజీ ప్రధాని పీవీ, పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్ చనిపోయి ఏండ్లు గడుస్తున్నా ఓట్లు తొలగించలేదు. 2014కు ముందు అక్రమంగా దేశంలోకి వచ్చిన 4 కోట్ల మంది ఓట్లను, శాశ్వతంగా వలస వెళ్లిన 6 కోట్ల మంది ఓట్లను, కోటి డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే తప్పేంది? బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చినవారి ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ అనుకుంటోందా? పప్పూ.. ఇగ మీ పప్పులుడకవ్. అక్కడున్నది నిప్పు మోదీ.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్. విదేశీ చొరబాటుదారులకు ఈ దేశ ప్రధాని, సీఎంలను నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయనడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.
