- ఢిల్లీలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మోదీ చర్చలు
- అయోధ్య-జనక్‌పూర్ ‘సరయూ-కమల’ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
న్యూఢిల్లీ: భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణం, బాధితులను ఆదుకునేందుకు రూ.15 వేల కోట్ల (24 వేల కోట్ల నేపాలీ రూపాయలు) ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎనిమిది కీలక ఒప్పందాలు కుదిరాయి. పలు రవాణా, విద్యుత్ ప్రాజెక్టులను నేతలు వర్చువల్‌గా ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.
ఇంధనం, ఎరువుల సరఫరాకు భరోసా
నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవలి ఎన్నికల్లో ఆయన సాధించిన మెజారిటీ నేపాల్ యువత ఆకాంక్షలకు నిదర్శనమని మోదీ కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో అతి పిన్న వయసులో ప్రసంగించిన ప్రధానిగా ఆయన నిలిచారని ప్రశంసించారు. ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 1,500 మంది చనిపోగా, మరో 5,200 మంది గల్లంతవడంపై సానుభూతి తెలిపారు. చర్చల అనంతరం సివిల్ సర్వీస్ శిక్షణ, అంతరిక్ష పరిశోధన, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, ఆయుర్వేదం తదితర రంగాల్లో ఎనిమిది ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పాస్‌పోర్ట్, వీసా అవసరం లేని బహిరంగ సరిహద్దు కలిగిన నేపాల్‌కు ఇంధనం, ఎరువులు, నిత్యావసరాల సరఫరాను నిరంతరాయంగా కొనసాగిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం నేపాల్ నుంచి భారత్ సుమారు 1,200 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకుంటోంది. నేపాల్‌లో చైనా పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ప్రకటించిన ప్యాకేజీకి వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది.
కాళీ నదిపై 110 మీటర్ల వంతెన
ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లా ఛార్ఛుమ్ గ్రామం, నేపాల్‌లోని దార్చులా జిల్లా అసిగడ గ్రామాలను కలిపే 110 మీటర్ల పొడవైన మోటార్ బ్రిడ్జిని మోదీ, బాలేంద్ర షా వర్చువల్‌గా ప్రారంభించారు. 2022లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ శంకుస్థాపన చేసిన ఈ వంతెనను 10.50 మీటర్ల వెడల్పుతో, 7.5 మీటర్ల క్యారేజ్ వేతో నిర్మించారు. ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. పిథోరగఢ్ సరిహద్దులో ఇదే తొలి వాణిజ్య వంతెన కాగా, ఉత్తరాఖండ్‌లో రెండోది. ప్రారంభించిన వెంటనే రాకపోకలకు అనుమతించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ భత్గాయ్ తెలిపారు. ఈ వంతెనతో పశ్చిమ నేపాల్‌లో వాణిజ్యం పెరుగుతుందని అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అయోధ్య–జనక్‌పూర్ రైలు సర్వీసును కూడా నేతలు ప్రారంభించారు.
మోదీకి నేపాల్ ఆహ్వానం
పర్యటన సందర్భంగా బాలేంద్ర షాకు మోదీ ప్రత్యేక కానుకలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి శైలికి చెందిన ‘కళంకారీ సంపూర్ణ రామాయణం’ పెయింటింగ్, గుజరాత్ సాదేలి బాక్స్‌లో బనారసి స్టోల్, ఇత్తడి పాత్రలో వారణాసి గంగాజలాన్ని బహూకరించారు. భారత్‌లో తనకు లభించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపిన బాలేంద్ర షా.. నేపాల్ పర్యటనకు రావాలని మోదీని సాదరంగా ఆహ్వానించారు.
