- సిటీ నడిబొడ్డున ఐటీ టవర్ల నిర్మాణానికి సర్కారు అడుగులు
- ఐటీ టవర్ల నిర్మాణానికి సర్కారు అడుగులు
- పరిశీలనలో హంటర్‍రోడ్, హయగ్రీవాచారి గ్రౌండ్ భూములు
- ప్రముఖ కంపెనీలు తీసుకొచ్చేందుకు సర్కారు చొరవ
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో త్వరలోనే ఐటీ టవర్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై స్పెషల్‌ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మేజర్ ప్రాజెక్టులు వరుసకడుతున్నాయి. ఇప్పటికే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి భారీ ప్రాజెక్టులు నగరానికి మంజూరయ్యాయి. ప్రస్తుతం నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ కంపెనీలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఐటీ టవర్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది.
సిటీ మధ్యలో ఐటీ టవర్లు..
వరంగల్ స్మార్ట్ సిటీలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలు ప్రధానంగా ఉండగా ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న హనుమకొండ సిటీ నడిబొడ్డున ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్ తర్వాత ఐటీ రంగంలో ఓరుగల్లును కీలక కేంద్రంగా నిలిపేలా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐటీ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. సిటీకి దూరంగా కాకుండా ప్రజలకు, ఉద్యోగులకు అందుబాటులో ఉండేలా సిటీ మధ్యలోనే స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించింది. నిర్మాణాలు త్వరగా పూర్తయితే ప్రముఖ ఐటీ కంపెనీలను వరంగల్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపనుంది.
హంటర్‌రోడ్ లేదా హయగ్రీవాచారి గ్రౌండ్..
అన్ని రకాల మౌలిక వసతులతో ఐటీ టవర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నాలుగు నుంచి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి సేకరించాలని చెప్పిన క్రమంలో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నారు. హనుమకొండలోని జూపార్క్ సమీపంలో హంటర్‌రోడ్, న్యూశాయంపేట జంక్షన్ వద్ద ప్రభుత్వానికి తొమ్మిది ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఐదు ఎకరాలను శిల్పారామం నిర్మాణానికి కేటాయించాల్సి ఉండగా, మిగిలిన నాలుగు ఎకరాలను ఐటీ టవర్లకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం పక్కన ఉన్న హయగ్రీవాచారి గ్రౌండ్ స్థలాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీనిని పూర్తిచేసి పనుల నిర్వహణకు కావాల్సిన అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది.
దూరం ఎక్కువ.. జీతాలు తక్కువ..
ఓరుగల్లులో ఎన్‍ఐటీ, కాకతీయ యూనివర్సిటీ ఉండటానికితోడు పదుల సంఖ్యలో ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యాకేంద్రంగా ఉంది. ఉమ్మడి వరంగల్ ఆరుజిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల చదువుల కోసం నుంచి పెద్దఎత్తున వరంగల్‍కు వస్తుంటారు. ఈ క్రమంలో ఐటీ కంపెనీలతో ఇక్కడి యువత, నిరుద్యోగులకు పెద్దఎత్తున ఐటీ ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. అయితే ఇక్కడ పలు సంస్థలు ప్రారంభించిన ఒక్కో కంపెనీలో 100 నుంచి 200 మందిలోపే ఉద్యోగాలు కల్పించగా, మెజార్టీ ఉద్యోగులకు రూ.15 వేల నుంచి రూ.20 వేలలోపే జీతాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు చిన్నపాటి జీతాలతో ఐటీ పార్క్ ఏరియాలో అద్దెకు ఉండడం భారంగా మారింది. వరంగల్, ధర్మారం, గీసుగొండ, మామునూరు వంటి ప్రాంతాల నుంచి రోజూ సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక్కొక్కరుగా ఉద్యోగాలకు దూరమయ్యారు. దీంతో ఇక్కడ తమ సంస్థలను ప్రారంభించిన కంపెనీలు నామమాత్రంగా పని చేస్తున్నాయి.
గులాబీ నేతల భూముల వద్ద.. ఐటీ పార్క్!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు భూముల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదమయ్యింది. హైదరాబాద్ వెళ్లే మార్గంలో సిటీకి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడికొండలో ఇండస్ట్రియల్ ఏరియా కోసం భూములు కేటాయించారు. అప్పట్లో అక్కడి భూముల కేటాయింపుల వెనుక కొందరు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మడికొండ ప్రాంతంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 2016లో ప్రభుత్వ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం 2020లో టెక్ మహీంద్రా, సైయంట్ వంటి కంపెనీలు వచ్చాయి. అదే ఏడాది క్వాడ్రంట్ టెక్నాలజీస్‌కు శంకుస్థాపన చేయగా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడిగా ప్రారంభించారు.
సిటీ మధ్యలోనే టవర్లకు భూమి
గ్రేటర్ వరంగల్ విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక యువత, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కోసం ఐటీ టవర్లు నిర్మించేలా ప్రభుత్వం తరఫున చొరవ తీసుకున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిటీనడిబొడ్డున భూములు కేటాయిస్తాం. ఇందుకోసం హంటర్‍రోడ్ శిల్పారామం, హయగ్రీవచారీ భూములను పరిశీలిస్తున్నాం.
-నాయిని రాజేందర్‍రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
