తుపాకీ వీడి వస్తే అండగా ఉంటాం : డీజీపీ సీవీ ఆనంద్

తుపాకీ వీడి వస్తే అండగా ఉంటాం : డీజీపీ సీవీ ఆనంద్
  • మావోయిస్టులకు పునరావాసం, ఆరోగ్య భద్రత, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం: డీజీపీ సీవీ ఆనంద్
  • కర్రెగుట్టల్లో ఇంకా తొలగని మందుపాతరలు
  • 214 మందికి రూ.5.59 కోట్ల రివార్డుల పంపిణీ
  • ఇప్పటివరకు 824 మంది మావోయిస్టుల లొంగుబాటు
  • గణపతి, రత్నాభాయ్, వార్త శేఖర్ కూడా లొంగిపోవాలని పిలుపు

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులకు ఆర్థిక భరోసా, పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ అన్నారు. లొంగిపోయిన వాళ్లకు సాధారణ జీవనానికి అవసరమైన ఆర్థిక సాయం, ఆరోగ్య భద్రత, వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని స్పష్టం చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన 214 మందికి పునరావాసం కింద రూ.5.59 కోట్ల రివార్డులు సోమవారం ఆయన అందించారు.

డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌ డీజీ (లా అండ్ ఆర్డర్) అకున్ సబర్వాల్‌‌‌‌, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయుధాలు అప్పగించిన వారికి రూ.8 లక్షల నుంచి వారివారి హోదా, రివార్డులకు అనుగుణంగా డీడీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడతూ.. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

లొంగిపోయిన మాజీలు ఏ పొలిటికల్ పార్టీలకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. సొంతగా పార్టీలు ఏర్పాటు చేసేందుకు ఎవ్వరూ అనుమతులు కోరలేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, పరిమితులకు లోబడి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ, ప్రజా కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని, అయితే మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారాన్ని ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.

ఆ ముగ్గురు లొంగిపోండి.. 

కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌‌‌‌ గణపతి సహా జోడే రత్నభాయ్‌‌‌‌, వార్త శేఖర్‌‌‌‌ ఆచూకీపై స్పష్టమైన సమాచారం లేదని డీజీపీ వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైతం వారి జాడ లభించలేదని తెలిపారు. ఈ ముగ్గురూ అసలు బతికే ఉన్నారా.. లేక చనిపోయారా.. అనేది తెలియదన్నారు. వీరు కూడా ఉద్యమాన్ని వీడి సాధారణ జీవితం గడపాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారు ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను వినియోగించుకుని చట్టబద్ధమైన జీవితం గడపాలని, జనజీవన స్రవంతిలో కలిసిన వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని డీజీపీ స్పష్టం చేశారు. 

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు చెందిన వారే 754 మంది..

తెలంగాణలో ఇప్పటివరకు 824 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారని డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. కాగా, లొంగిపోయిన వారిలో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు చెందిన వారు 754 మంది ఉండగా, తెలంగాణకు చెందిన వారు 59 మంది, ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు చెందిన వారు 9 మంది, మహారాష్ట్ర, ఒడిశాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు లొంగిపోయిన వారికి రూ.17.68 కోట్ల మేర నగదు రివార్డులు, పునరావాస సాయం పంపిణీ చేసినట్లు తెలిపారు.

నివాస వసతి కింద తెలంగాణకు చెందిన పది మందికి ఇండ్ల మంజూరు పూర్తయిందని, మరో 49 మందికి ఇండ్ల సదుపాయం కల్పించనున్నట్లు వివరించారు. మరోవైపు, తెలంగాణ– చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన ల్యాండ్‌‌‌‌ మైన్స్‌‌‌‌ సహా పేలుడు పదార్థాలు, ఇతర ప్రమాదకర అవశేషాల తొలగింపు పూర్తికాలేదని డీజీపీ వెల్లడించారు. మందుపాతరలు అమర్చిన మావోయిస్టులు.. ఎక్కడెక్కడ అమర్చారో చెప్పలేక పోతున్నారన్నారు.

ఈ క్రమంలోనే మందుపాతరలను పూర్తిగా తీయలేకపోయామని చెప్పారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు టూరిజం సహా ఇతర పర్యటనలకు అనుమతి ఇవ్వబోమన్నారు. మరోవైపు, సుమారు 500 ఆయుధాల ఆచూకీ ఇంకా లభించలేదని, వాటి కోసం ఇతర రాష్ట్రాలతో కలిసి గుర్తించాల్సి ఉందన్నారు.