- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ముషీరాబాద్,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి తగిన నిధులు కేటాయించి కార్మికులను ఆదుకోవాలని చేనేత వర్గాల చైతన్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం “కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు–చేనేత కళాకారులపై వివక్ష” అనే అంశంపై వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ టి. చిరంజీవులు హాజరై మాట్లాడుతూ చేనేత రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తున్నాయని, కేటాయించిన నిధులను సైతం పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని విమర్శించారు.
చేనేత కార్మికులకు కనీస వేతనాలు, నూలు సబ్సిడీ, 25 శాతం వస్త్రాల సబ్సిడీ కల్పించాలని, ప్రభుత్వ సంస్థల ద్వారా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని కోరారు. చేనేత రంగ సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలతో జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. మాజీ ఆప్కో చైర్మన్ వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ చేనేత సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఐక్య ఉద్యమం చేపట్టాలని ప్రతిపాదించారు. తెలంగాణ హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కా రజిత, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు ఎర్రమాద వెంకన్న నేత పాల్గొన్నారు.
