ఇండోనేసియా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 24 మంది మృతి

ఇండోనేసియా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 24 మంది మృతి

జకార్తా: చాక్లెట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది చనిపోయారని ఇండోనేసియా ప్రభుత్వం వెల్లడించింది. మరో 30 మంది కార్మికుల ఆచూకీ గల్లంతైందని వివరించింది. రెస్క్యూ సిబ్బంది వారికోసం గాలిస్తున్నారని పేర్కొంది.  

రాజధాని జకార్తాకు సమీపంలోని చికాండేలో ఉన్న క్యాండీల ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తొలుత ఈ ప్రమాద తీవ్రత తక్కువే ఉన్నా సోమవారం నాటికి చాలా పెరిగింది. 

ఈ ప్రమాదంపై అధ్యక్షుడి సలహాదారు సయీద్ ఇక్బాల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏసీలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అన్నారు. భవనం లోపల ఇంకా పొగలు, నిప్పు రవ్వలు ఉండటం, భవనం కూలిపోయే స్థితిలో ఉండటం సహాయక సిబ్బందికి పెనుసవాలుగా మారిందని ఫైర్ సిబ్బంది తెలిపారు.