టూరిజం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి : ఏఐటీయూసీ

టూరిజం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి : ఏఐటీయూసీ
  • స్పెషల్ సీఎస్ వాణీ ప్రసాద్‌‌‌‌కు ఏఐటీయూసీ వినతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ అనుబంధ టూరిజం కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, 23 ఏండ్లుగా చాలీచాలని వేతనాలతోనే కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.

సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్‌‌‌‌ను ఆ సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్‌‌‌‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ సిబ్బందికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచాలని నాయకులు కోరారు. టూరిజం ప్లాజా ఉద్యోగులు, ఏజెన్సీ సిబ్బంది, రోజువారీ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో కల్పించిన బస్సు పాస్ సౌకర్యం, తెలంగాణ ఇంక్రిమెంట్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం గౌరవ అధ్యక్షుడు చాడ వెంకట్‌‌‌‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, నాయకులు ఉడత రమేశ్‌‌‌‌, పి. శ్రీనివాస్ రెడ్డి, సీహెచ్ రాజయ్య తదితరులు ఉన్నారు.