- జీవిత ఖైదు అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు
- గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఊరట
న్యూఢిల్లీ, వెలుగు: 2002 గోద్రా రైలు దహనం కేసులో దోషి ఇర్ఫాన్ సిరాజ్ పాడాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన జీవిత ఖైదు శిక్ష అమలును నిలిపివేసింది. సోమవారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పాడా 17 ఏండ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
వైద్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గుజరాత్ ప్రభుత్వం తరఫు న్యాయవాది స్వాతి ఘిల్డియాల్ ధ్రువీకరించారు. బెయిల్‌పై తమకు అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గతంలోనూ పలువురికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. 2022 మేలో అబ్దుల్ రెహమాన్ ధంతియాకు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అదే ఏడాది డిసెంబర్‌లో ఫరూక్‌కు, 2023 ఏప్రిల్‌లో మరో ఎనిమిది మంది దోషులకు బెయిల్ ఇచ్చింది. 2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి కరసేవకులతో వస్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-6 బోగీకి గోద్రా వద్ద నిప్పంటుకోవడంతో 58 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తర్వాత గుజరాత్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ కేసులో 2011లో ట్రయల్ కోర్టు 31 మందిని దోషులుగా తేల్చి, 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది. మరో 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో హైకోర్టు 11 మంది మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చి, మిగతా శిక్షలను సమర్థించింది. దోషుల అప్పీళ్లు 2018 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
