ఆసియాలో భారత్ హవా..శక్తిమంతమైన దేశంగా మూడో స్థానం సుస్థిరం

ఆసియాలో భారత్ హవా..శక్తిమంతమైన దేశంగా మూడో స్థానం సుస్థిరం
  • అత్యంత సమర్థ నాయకుడిగా మోదీకి 2వ స్థానం
  • మొత్తం 8 ప్రమాణాల్లో ఐదింటిలో భారీ వృద్ధి నమోదు

న్యూఢిల్లీ: ప్రపంచ వేదికపై భారత్ తన సత్తాను మరోసారి చాటుకుంది. ఆసియాలో మూడో అత్యంత శక్తిమంతమైన దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అలాగే, ఆసియాలో అత్యంత సమర్థవంతమైన ప్రాంతీయ నాయకుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానం (చైనా అధ్యక్షుడు జిన్‌‌‌‌పింగ్ మొదటి స్థానం) దక్కించుకున్నారు. ఈ వివరాలను ఆస్ట్రేలియా సంస్థ ‘లోవీ ఇన్‌‌‌‌స్టిట్యూట్’ విడుదల చేసిన '2026 ఆసియా పవర్ ఇండెక్స్' సోమవారం వెల్లడించింది. 

27 దేశాలు, భూభాగాలను 131 సూచికల ఆధారంగా విశ్లేషించి రూపొందించిన ఈ నివేదికలో భారత్ 100కు 40.5 పాయింట్లతో ప్రధాన శక్తిగా నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా (78.9), రెండో స్థానంలో చైనా (73.6)ఉన్నాయి. బలమైన ఆర్థిక అంచనాలు, స్థిరమైన దౌత్య ప్రభావం, మోదీ సమర్థ నాయకత్వంతో భారత్ తన ‘పవర్ యీల్డ్ (వనరులు, వాస్తవ శక్తి మధ్య వ్యత్యాసం)’ తగ్గించుకుంది. 2018లో ఆసియా పవర్ ఇండెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి చైనాతో ఉన్న శక్తి వ్యత్యాసాన్ని భారత్ అత్యల్ప స్థాయికి తగ్గించుకోవడం విశేషం. అయినప్పటికీ, చైనా శక్తి మన దేశం కంటే 80% ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

దౌత్యం, రక్షణ రంగాల్లో భారత్ జోరు

రిపోర్ట్ ప్రకారం.. మొత్తం 8 ప్రమాణాల్లో భారత్ ఐదింటిలో వృద్ధి, మూడింటిలో స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. అనేక దేశాలు దౌత్యపరంగా క్షీణించినా, భారత్ 70.3 పాయింట్లతో దౌత్య ప్రభావాన్ని (డిప్లొమాటిక్ ఇన్‌‌‌‌ఫ్లుయెన్స్) బలంగా నిలబెట్టుకుంది. ఆగ్నేయాసియాతో రక్షణ ఒప్పందాలు, బ్రహ్మోస్ క్షిపణి విక్రయాలతో రక్షణ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో రెండు స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరింది. సాంస్కృతిక వ్యాప్తి, సమాచార చేరవేత, ప్రజల పరస్పర మార్పిడితో సాంస్కృతిక ప్రభావం 43.8 పాయింట్లకు పెరిగింది. 

రూపాయి బలహీనత, ఐఎంఎఫ్ ప్రమాణాల మార్పు, విదేశీ పెట్టుబడుల్లో సుమారు 20 బిలియన్ డాలర్ల (రూ.1.70 లక్షల కోట్లు) తగ్గుదలతో ఆర్థిక సామర్థ్యం కొంత తగ్గినా..భవిష్యత్ వనరుల స్కోరు 56.2కు పెరిగింది. గల్ఫ్ ఘర్షణ వేళ తక్కువ దౌత్య క్రియాశీలతతో మోదీ వ్యూహాత్మక ఆశయాలపై అభిప్రాయాలు కొంత తగ్గాయి. అయినా ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌‌‌‌కు ఉన్న అవకాశాల పరిధి చాలా ఎక్కువని నివేదిక ప్రశంసించింది.

అమెరికా చేరువలోకి చైనా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాల్లో నిమగ్నం కావడంతో సైనిక శక్తిలో చైనా వాషింగ్టన్‌‌‌‌కు బాగా చేరువైంది. అమెరికా (78.9), చైనా (73.6) మధ్య సమగ్ర శక్తి వ్యత్యాసం 5.3 పాయింట్లకు తగ్గింది. ఆర్థిక, సైనిక సామర్థ్యాలు, రక్షణ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లు, దౌత్య ప్రభావంలో అమెరికా నష్టపోగా, చైనా స్థిరంగా నిలిచింది. సైన్యం పెంపు, నౌకాదళ విస్తరణతో ఫిలిప్పీన్స్, తైవాన్‌‌‌‌లపై ప్రాదేశిక వాదనలను చైనా ఉద్ధృతం చేస్తోందని నివేదిక హెచ్చరించింది.