ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌కు 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.50 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేయడంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన గిరిజన, గ్రామీణ, పేద కుటుంబాలు కూడా వైద్య సేవల కోసం రిమ్స్ పై ఆధారపడుతున్నాయి.
ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ప్రత్యేక వైద్య సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మాతా శిశు వైద్య సేవలు సాధారణ ఆస్పత్రి భవనంలోనే కొనసాగుతుండటంతో పడకలు, వసతుల కొరత ఏర్పడుతున్న విషయాన్ని ఇటీవల ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో గిరిజన ప్రాంతాల పేద తల్లులు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుంది.
