వెలుగు స్పెషల్ : పసితనాన్ని బందీ చేయకండి!

వెలుగు స్పెషల్ : పసితనాన్ని బందీ చేయకండి!

బాల్యం అంటే నిర్మలమైన ఆకాశంలాంటిది. అందులో స్వేచ్ఛగా విహరించే పక్షులే మన పిల్లలు. కానీ నేటి ఆధునిక సమాజంలో ఆ పసిపిల్లల రెక్కలకు తల్లిదండ్రుల ‘అంచనాలు’ అనే బరువైన సంకెళ్లు పడుతున్నాయి. తాము సాధించలేకపోయిన కలలను, సమాజంలో తమకు దక్కని హోదాను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని  తల్లిదండ్రుల ఆరాటపడుతున్నారు. తల్లిదండ్రుల తీరు పసిమనసులకు మోయలేని భారంగా మారింది. అప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటున్న పసిప్రాయంలోనే ర్యాంకులు, మార్కులు, పోటీ పరీక్షల పేరుతో వారి బాల్యాన్ని చిదిమేస్తున్న  దృశ్యాలు ప్రతి ఇంటా కనిపిస్తున్నాయి.

  ఒకప్పుడు బడి గంట మోగగానే పిల్లల కేరింతలతో వీధులన్నీ సందడిగా ఉండేవి. మట్టిలో ఆటలు, స్నేహితులతో అల్లరి, అమ్మమ్మల కథలు వారి ఊహాశక్తికి రెక్కలు తొడిగేవి. కానీ నేడు, ఉదయం సూర్యుడు ఉదయించకముందే బడి బస్సుల హారన్లతో మొదలయ్యే పిల్లల దినచర్య, రాత్రి పొద్దుపోయే వరకు ట్యూషన్లు, హోంవర్క్‌‌ల మధ్య నలిగిపోతోంది. వీపుపై మోసే పుస్తకాల సంచి బరువు కంటే, తల్లిదండ్రుల ఆశల బరువే ఆ లేత భుజాలను ఎక్కువగా కుంగదీస్తోంది. ఆటపాటలకు దూరమై, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిన పసిపిల్లలు తమ సహజమైన చిరునవ్వును, ఉత్సాహాన్ని కోల్పోతున్నారు.  

ఒకరికి చదువులో ఆసక్తి ఉంటే, మరొకరికి సంగీతంలోనో, చిత్రలేఖనంలోనో, క్రీడలలోనో అద్భుతమైన నైపుణ్యం ఉండవచ్చు. కానీ, అందరినీ ఒకే మూసలో పోసి, కేవలం డాక్టర్లు, ఇంజినీర్లుగానే చూడాలనుకోవడం సరికాదు. తల్లిదండ్రుల ఈ అంచనాల వేటలో పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న వయసులోనే ఆందోళన, నిరాశ, ఒంటరితనం వంటి సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి.  ప్రేమతో పెంచాల్సిన తల్లిదండ్రులే, కఠినమైన నియమాలతో తమ పిల్లలకు శత్రువులుగా మారుతున్నారనే చేదు నిజాన్ని మనం అంగీకరించక తప్పదు. పిల్లలకి  మనం ఇవ్వాల్సింది విలువైన ఆస్తులు, ఖరీదైన బహుమతులు కాదు. స్వేచ్ఛగా ఆలోచించే వాతావరణం, ఓటమిని సైతం చిరునవ్వుతో స్వీకరించే ధైర్యం!  తమ పిల్లలకు తల్లిదండ్రులు తగిన స్వేచ్ఛను ఇస్తే  ఆ పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారంటే అతిశయోక్తి కాదు.

- కాదాసి అమరేందర్