హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల ..పనులు స్పీడప్ చేయండి :మంత్రి దామోదర్ రాజనర్సింహా

హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల ..పనులు స్పీడప్ చేయండి :మంత్రి దామోదర్ రాజనర్సింహా
  • అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశం
  • పూర్తయిన జనగాం మెడికల్ కాలేజీ, సీసీబీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఆయా భవనాల నిర్మాణ పనుల పురోగతిపై సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. సుమారు రూ.154 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించిన జనగాం మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించగా, వాటి ప్రారంభోత్సవానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని మంత్రి దామోదర్ సూచించారు.

కరీంనగర్ మెడికల్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల చివరికల్లా గర్ల్స్ హాస్టల్, డిసెంబర్ చివరికల్లా బాయ్స్ హాస్టల్‌‌‌‌, మార్చి చివరి నాటికి మెడికల్ కాలేజీ భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. 

మార్చిలోగా సిద్ధిపేట టీచింగ్​ హాస్పిటల్​.. 

సిద్ధిపేట టీచింగ్ హాస్పిటల్ నిర్మాణ పనులను స్పీడప్ చేసి మార్చి చివరి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి దమోదర్​సూచించారు. సిద్దిపేట మెడికల్ కాలేజీ తదితర సంస్థలకు మాజీ మంత్రి అనంతుల మదన్ మోహన్ పేరు పెడుతూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే నేమ్ బోర్డులు మార్చి, వెబ్‌‌‌‌ సైట్లలోనూ పేరును అప్‌‌‌‌ డేట్ చేయాలని స్పష్టం చేశారు.

హుస్నాబాద్‌‌‌‌ లో మెడికల్ పీజీ కాలేజీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, డీఎంఈ వాణి, అకాడమిక్ డీఎంఈ రమాదేవి, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట్, జనగాం కలెక్టర్లు, ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.