ఓఆర్‌‌‌‌ఆర్ పై పచ్చదనానికి శుద్ధి చేసిన నీరు..రోజుకు 6 లక్షల లీటర్ల వ్యర్థజలాల సరఫరా

ఓఆర్‌‌‌‌ఆర్ పై పచ్చదనానికి శుద్ధి చేసిన నీరు..రోజుకు 6 లక్షల లీటర్ల వ్యర్థజలాల సరఫరా
  •     హెచ్‌‌‌‌ఎండీఏ, హిందుస్థాన్‌‌‌‌ 
  •     కోకాకోలా బెవరేజెస్‌‌‌‌ మధ్య కీలక ఒప్పందం

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని పచ్చదనాన్ని పరిరక్షించడంతో పాటు మంచినీటి వనరుల వినియోగాన్ని తగ్గించే దిశగా హెచ్‌‌‌‌ఎండీఏ కీలక అడుగు వేసింది. శుద్ధి చేసిన పారిశ్రామిక వ్యర్థజలాలను నగరంలోని గ్రీన్‌‌‌‌బెల్ట్స్‌‌‌‌ నిర్వహణకు వినియోగించేందుకు హిందుస్థాన్‌‌‌‌ కోకాకోలా బెవరేజెస్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీసీబీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌‌‌‌లోని హెచ్‌‌‌‌సీసీబీ అవిన్యా ఉత్పత్తి కేంద్రం నుంచి రోజుకు 6 లక్షల లీటర్ల శుద్ధి చేసిన వ్యర్థజలాలను సరఫరా చేయనున్నారు. ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై ఎగ్జిట్‌‌‌‌ 4 నుంచి 8 మధ్య ఉన్న మొక్కల పెంపకంతో పాటు హెచ్‌‌‌‌ఎండీఏ ఆధ్వర్యంలోని ఇతర ప్రాంతాలకు ఈ నీటిని వినియోగిస్తారు. 

హెచ్‌‌‌‌ఎండీఏ మెట్రోపాలిటన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ సమక్షంలో సోమవారం ఈ ఒప్పందం ఖరారైంది. హెచ్‌‌‌‌ఎండీఏ అర్బన్‌‌‌‌ ఫారెస్ట్రీ డైరెక్టర్‌‌‌‌, బీపీపీ ఓఎస్డీ (ఇన్‌‌‌‌చార్జి) రోహిత్‌‌‌‌ గోపిడి, హెచ్‌‌‌‌సీసీబీ అవిన్యా ప్లాంట్‌‌‌‌ ఫ్యాక్టరీ మేనేజర్‌‌‌‌ మాధవన్‌‌‌‌ పిళ్లై ఇందులో పాల్గొన్నారు. సర్ఫరాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ మాట్లాడుతూ.. ఎల్‌‌‌‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. శుద్ధి చేసిన వ్యర్థజలాలను పచ్చదనం పెంపునకు వినియోగించడం వల్ల భూగర్భజలాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు మంచినీటిని ఆదా చేయవచ్చన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే నగర నిర్మాణానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ వెంట గ్రీన్‌‌‌‌బెల్ట్స్‌‌‌‌ను ఏడాది పొడవునా పచ్చగా ఉంచేందుకు నిరంతర నీటి నిర్వహణ అవసరమని రోహిత్‌‌‌‌ గోపిడి తెలిపారు. హెచ్‌‌‌‌సీసీబీ ప్రతినిధి అవినాష్‌‌‌‌ కాంత్‌‌‌‌ కుమార్‌‌‌‌ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రాంతీయ పర్యావరణ పరిరక్షణకు తమ సంస్థ తోడ్పడుతుందని పేర్కొన్నారు.