చైనా నుంచి బంగ్లాకు తరలిస్తున్న.. క్షిపణి రసాయనం పట్టివేత

చైనా నుంచి బంగ్లాకు తరలిస్తున్న..  క్షిపణి రసాయనం పట్టివేత
  • ఇండోనేసియాలోని బెలవాన్ తీరంలో పట్టుకున్న నేవీ సిబ్బంది
  • 100 మిస్సైల్స్ తయారీకి సరిపడే సోడియం పెర్క్లోరేట్ స్వాధీనం

ఢాకా: చైనా నుంచి బంగ్లాదేశ్‌‌‌‌కు అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, లక్షలాది సిమ్ కార్డులను అక్రమంగా తరలిస్తున్న ఓ భారీ నౌకను ఇండోనేసియా నేవీ అదుపులో తీసుకుంది. కొమొరోస్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ స్టార్​లైన్ అనే ఈ నౌకను నవంబర్ 7న ఇండోనేసియాలోని బెలావాన్ తీర జలాల్లో అడ్డుకున్నట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇంధనం నింపుకోవడానికి ఈ నౌక బెలావాన్ తీరంలో లంగరు వేయగా, ఆ సమయంలో అక్కడే గస్తీ తిరుగుతున్న ఇండోనేసియా నేవీ పెట్రోలింగ్ నౌక ‘కేఆర్‌‌‌‌ఐ సిగాలు– 857’ సిబ్బందికి దీని కదలికలపై అనుమానం వచ్చింది. నిర్దేశించిన మార్గంలో కాకుండా నౌక పక్కదారిలో వెళ్తుండటాన్ని గమనించిన సిబ్బంది, తనిఖీల కోసం దాన్ని ఆపారు. ప్రాథమిక పరిశీలనలోనే నౌక పత్రాలకు, సరుకు వివరాలకు పొంతన లేకపోవడంతో క్షుణ్ణంగా సోదాలు జరిపారు. 

లక్షలాది 4జీ సిమ్ కార్డులు స్వాధీనం 

నౌకలోని మొత్తం 36 కంటైనర్లను తనిఖీ చేయగా, అందులో 15 కంటైనర్లలో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ ఉన్నట్టు బయటపడింది. రాకెట్లు, క్షిపణుల ప్రొపెల్లెంట్స్ తయారీలో ఉపయోగించే అత్యంత శక్తిమంతమైన ఆక్సీకరణ రసాయనమిది. ఈ నిల్వలతో దాదాపు 100 మిస్సైల్స్‌‌‌‌ను తయారు చేయవచ్చని ఇండోనేసియా నేవీ కమాండర్ వెల్లడించడం కలకలం రేపుతోంది. 

రసాయనాలతో పాటు 54 ప్యాలెట్లలో లక్షలాది అన్-రిజిస్టర్డ్ బ్లాంక్ 4జీ ఎల్‌‌‌‌టీఈ సిమ్ కార్డులు కూడా పట్టుబడ్డాయి. ఈ భారీ రవాణా వెనుక ఎవరున్నారు, బంగ్లాదేశ్‌‌‌‌లో వీటిని ఎవరు డెలివరీ తీసుకోబోతున్నారనే కోణంలో ఇండోనేసియా అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఇలాంటి సున్నితమైన రసాయనాలు రవాణా కావడంపై భద్రతా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నౌక సిబ్బందిని ప్రశ్నిస్తున్న అధికారులు, కార్గో పత్రాల్లోని అవకతవకలపై ఆరా తీస్తున్నారు.