మక్తల్‌‌‌‌‌‌‌‌ను స్టడీ, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతా: మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌‌‌‌‌‌‌‌ను స్టడీ, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతా: మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: మక్తల్‌‌‌‌‌‌‌‌ను స్టడీ హబ్‌‌‌‌‌‌‌‌గా, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతానని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్​ వద్ద రూ.9 కోట్లతో నిర్మించనున్న నూతన డిగ్రీ కాలేజ్​ భవనానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్తల్‌‌‌‌‌‌‌‌ను విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా మారుస్తానని చెప్పారు. డిగ్రీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం తొలుత రూ.6 కోట్లు కేటాయించగా, సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.9 కోట్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. భూమిపూజ చేసిన రోజే నిర్మాణ పనులు ప్రారంభించడం తన అలవాటని, వచ్చే ఏడాది కార్తీక మాసంలో నూతన కళాశాల భవనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

త్వరలోనే పీజీ కళాశాలను కూడా తీసుకొస్తానని, మినీ రవీంద్రభారతి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే వెటర్నరీ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చామని, వచ్చే నెలలో 150 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిస్తామన్నారు. మక్తల్‌‌‌‌‌‌‌‌లో అధునాతన సౌకర్యాలతో స్టేడియం నిర్మించాలన్నది తన సంకల్పమని, కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. సంగంబండ ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రియాంక, మక్తల్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వాకిటి మానస, కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌ అల్కూరి పావని, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు మక్తల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని 8వ వార్డులో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రియాంకతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారుల నమోదు, అర్హత వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.