ఇరాన్ లో మహిళల స్వేచ్చ, కళాకారుల హక్కులపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. హిజాబ్ లేకుండా పాట పాడటమే నేరంగా పరిగణించారు అక్కడి అధికారులు. పరుస్తూ అహ్మదీపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెతో పాటు సంగీత బృందానికి చెందిన సోహైల్ ఫఘీహ్ నసిరి, అమీన్ తహేరి, అమీర్ అలీ పిర్నియా, మొహ్సెన్ లష్కరీలకు కూడా 74 చొప్పున కొరడా దెబ్బలు విధించారు. నవంబర్ 23న ఖోమ్ నగరంలోని శిక్ష అమలు విభాగంలో ఈ శిక్షను అమలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది మోస్తఫా నిలీ వెల్లడించారు.
వివాదమేంటంటే..
2024 డిసెంబర్ 11న పరస్తూ అహ్మదీ తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ ప్రత్యేక సంగీత ప్రదర్శన వీడియోను విడుదల చేశారు. ఖోమ్ సమీపంలోని చారిత్రక దైర్ గచిన్ కారవాన్సెరాయ్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలో ఆమె ఎలాంటి హిజాబ్ ధరించకుండా.. పురుష సంగీతకారులతో కలిసి పాటలు పాడారు. ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన ఈ ప్రదర్శనకు 'ఇమాజినరీ కాన్సర్ట్' అనే పేరు పెట్టారు. ఈ వీడియోకు లక్షలాది మంది నుంచి స్పందన రావడంతో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చ మొదలైంది.
కొరడా దెబ్బలు..
అయితే ఇరాన్ అధికారులు ఈ ప్రదర్శనను చట్టవిరుద్ధంగా పరిగణించారు. ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందించి ప్రచురించారనే అభియోగాలతో కేసు నమోదు చేశారు. జూన్‌లో కోర్టు 74 కొరడా దెబ్బలతో పాటు రెండేళ్ల పాటు కళాత్మక, సంగీత కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. అప్పీల్‌లోనూ తీర్పు నిలవడంతో లేటెస్ట్ గా శిక్ష అమలైంది.
ALSO READ : ‘గోంధల్’కు ఆస్కార్ ఛాన్స్.. 104 చిత్రాల జాబితాలో భారత్‌కు చోటు
ఈ పరిణామంపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొరడా దెబ్బలు అమానవీయమైన శిక్షగా, హింసకు సమానమని విమర్శించాయి. 2022లో మహ్సా అమినీ పోలీసు కస్టడీలో మరణించిన తర్వాత ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా మహిళల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పుడు పరస్తూ అహ్మదీ ఉదంతం మరోసారి మహిళల హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్త చర్చకు తెరలేపింది..
