స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోతున్న చిన్నారిని కాపాడిన కుక్క

స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోతున్న చిన్నారిని కాపాడిన కుక్క

బ్రెజిల్: ఆపదలో ఉన్న రెండేళ్ల చిన్నారికి ఓ శునకం అండగా నిలిచింది. స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయి మునిగిపోతున్న చిన్నారిని కాపాడేందుకు గోల్డెన్ రిట్రీవర్ చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిన్నారి నీటిలో మునిగిపోకుండా తన వద్దకు చేరదీసి, కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఆమెకు అండగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బ్రెజిల్‌లోని మధ్య పశ్చిమ ప్రాంతమైన కుయాబాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో రెండేళ్ల చిన్నారి మైటే స్విమ్మింగ్ పూల్‌లోకి ఒంటరిగా వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తూ సమతుల్యత కోల్పోయి నీటిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో నీటిలో నిలదొక్కుకునేందుకు చిన్నారి తీవ్రంగా ఇబ్బంది పడింది.

అదే సమయంలో అక్కడే ఉన్న కుటుంబానికి చెందిన గోల్డెన్ రిట్రీవర్ టెరెజా వెంటనే చిన్నారి వద్దకు చేరుకుంది. నీటిలో మునిగిపోతున్న చిన్నారి శునకాన్ని పట్టుకోగా.. టెరెజా ఆమె పక్కనే ఉండి నీటిలో పూర్తిగా మునిగిపోకుండా అండగా నిలిచింది. చిన్నారిని తన వద్ద ఉంచుకుని కుటుంబ సభ్యులు వచ్చే వరకు తోడుగా ఉంది.

చిన్నారి స్విమ్మింగ్ పూల్‌లో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన ఇద్దరు మహిళా బంధువులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి చిన్నారితో పాటు శునకాన్ని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చిన్నారి తల్లి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ఉన్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేయడమే తన ఉద్దేశమని పేర్కొంది. రెండు సెకన్లలోనే విషాదం జరిగిపోవచ్చు అంటూ తల్లిదండ్రులను హెచ్చరించింది. తన కుమార్తెను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన టెరెజా పట్ల కృతజ్ఞతలు తెలిపింది.

హీరోగా మారిన టెరెజా.. నెటిజన్ల ప్రశంసలు

ఈ ఘటన తర్వాత చిన్నారి మైటే, టెరెజాతో కలిసి ఆనందంగా గడుపుతున్న మరో వీడియోను కూడా తల్లి షేర్ చేసింది. ప్రమాద సమయంలో చిన్నారికి అండగా నిలిచిన టెరెజాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూగజీవాల ప్రేమ, ఆపదలో స్పందించిన తీరు అందరి మనసులను కదిలిస్తోంది.