పంజాబ్ రాజకీయాల్లో కీలక మలుపు..మరోసారి బీజేపీ, అకాలీదళ్ పొత్తు

పంజాబ్ రాజకీయాల్లో కీలక మలుపు..మరోసారి  బీజేపీ, అకాలీదళ్ పొత్తు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.గతంలో విడిపోయిన బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మరోసారి కలిసి పోయాయి. ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ సయోధ్య కుదరడంతో పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు పూర్తిగా మారాయి. రెండు పార్టీల పొత్తును మంగళవారం (నవంబర్24) సంయుక్త మీడియా సమావేశంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. 

2020 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. దీంతో 24 ఏళ్లుగా కొనసాగిన బీజేపీ–అకాలీదళ్ మైత్రికి తెరపడింది. తాజాగా ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయి. 

గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాల్లో, అకాలీదళ్ 94 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఈసారి రాష్ట్రంలో తన రాజకీయ బలాన్ని పెంచుకునే లక్ష్యంతో ఎక్కువ స్థానాలు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు సమాచారం.. దీంతో సీట్ల పంపకం ఈ పొత్తులో కీలక అంశంగా మారింది. 

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పంజాబ్‌లో సుమారు 18 శాతం ఓట్లు సాధించగా, అకాలీదళ్‌కు 13 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. దీని ఆధారంగా రెండు పార్టీల ఓటు బ్యాంకులను కలిపి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సీట్ల పంపకంపై తుది నిర్ణయం, పొత్తు భవిష్యత్ కార్యాచరణపై అధికారిక ప్రకటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.