ఆధ్యాత్మికం : ఈ నాలుగు భయాలు లేనివాడే ఏదైనా సాధిస్తాడు.. చిరంజీవిగా నిలుస్తాడు..!

ఆధ్యాత్మికం : ఈ నాలుగు భయాలు లేనివాడే ఏదైనా సాధిస్తాడు.. చిరంజీవిగా నిలుస్తాడు..!

ఆయుష్షు ఉన్నంత కాలం ఎవరైనా బతికే ఉంటారు. అయితే చనిపోయిన తర్వాత కూడా జీవించి ఉండేది గొప్పవాళ్లు మాత్రమే. గొప్పవాళ్లుగా ఎదగడం వ్యక్తుల సత్ప్రవర్తన, సమాజానికి చేసిన మేలు, వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీని గురించి ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి, ధర్మరాజుకు చెప్పిన ఒక కథ.

పూర్వం హైహయ వంశానికి చెందిన 'ధుంధుమారుడు' అనే రాజకుమారుడు వేటకు వెళ్లాడు. అడవిలో చెట్ల మధ్య జింక చర్మం ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని, జింక అనుకుంటాడు. వెంటనే బాణం వేసి, దాని దగ్గరకు వెళ్లి చూస్తాడు. అక్కడ యువకుడి మృతదేహం కనిపించింది. తను పెద్ద తప్పు చేశానని భావించిన రాజకుమారుడు, బాధపడుతూ ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. 

వాళ్లు అక్కడికి వెళ్లి, ఆ యువకుడి మృతదేహాన్ని చూసి బాధపడ్డారు. వెంటనే రాజు, తన సపరివారంతో కలిసి పాప పరిహారం కోసం దగ్గర్లో ఉన్న తార్జ్యుడు   అనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. మహర్షితో జరిగిందంతా చెప్పారు. రాజకుమారుడు చంపింది మహర్షి ఆశ్రమానికి చెందిన వ్యక్తే అయ్యుండొచ్చని చెప్పారు. ధుంధుమారుడు చేసిన ఈ పాపానికి ఏదైనా పరిహారం చూపమని అడిగారు. 

అపుడు తార్జ్యుడు చిరునవ్వు నవ్వుతూ "త్రిలోకాలకూ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి మీకు చెప్పాలి. మా ఆశ్రమంలో ఎవరికీ భయం, వ్యాధి, దుర్గతి, మరణం ఉండనే ఉండవు. అందువల్ల ఈ రాజకుమారుడు ఇక్కడ ఎవరినో చంపడం అంతా అతడి భ్రమ" అంటూ, తపోబల సంపన్నుడు, తేజస్వి అయిన తన కొడుకును పిలిచి వారికి చూపుతూ "చూడండి... మీ రాజకుమారుడు బాణంతో కొట్టినది ఇతనినేనా?" అన్నాడు.

ALSO READ : షుగర్‌కు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడుతున్నారా?

ఆశ్చర్యం ! రాజకుమారుడు బాణంతో చంపింది. ఆ యువకుణ్ణి! కానీ, ఇప్పుడు బతికే ఉన్నాడు. ఇదెలా సాధ్యం? అనుకుంటూ ఆశ్చర్యపోయారు హైహయులు. అతడు ఎలా బతికాడో తెలియక, తమ సందేహాన్ని తీర్చుకునేందుకు “ఓ మహర్షీ! ఈ యువకుడు చనిపోయి మళ్లీ బతికాడు. ఇంతటి మహిమ ఇతనికి ఎలా సిద్ధించింది? దయచేసి చెప్పండి" అని అడిగారు.

అప్పుడు మహర్షి..
"ఆలస్యంబొకయింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా జాలంబేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబు పల్కంబడున్ మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు, మట్లాట నెక్కాలంబుం బటురోగ మృత్యుభయ శంకంబొంద మేమెన్నడున్" అన్నాడు. ఈ పద్యం ద్వారా మహర్షి, తన కుమారుడితోపాటు ఆశ్రమవాసులు మరణం లేకుండా బతికేందుకు గల కారణాలను వివరించాడు. 

“చేయవలసిన పనులు చేయటంలో ఒక్క క్షణమైనా ఆలస్యం చేయరు. శుచియైన ఆహారం మాత్రమే తింటారు. రోజువారీ చేసే పనుల్లో ఇంత కూడా నిర్లక్ష్యం ఉండదు. ప్రతీది లెక్క ప్రకారం పూర్తి చేస్తారు. అతిథుల్ని ఎప్పుడూ గౌరవిస్తారు. నిజాన్ని మాత్రమే మాట్లాడుతారు. ఎప్పుడూ శాంత స్వభావంతో ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు" అని వివరించాడు. ఈ లక్షణాలే తమ ఆశ్రమంలోని వాళ్లను అమరులుగా నిలిపాయని చెప్పాడు. 

ఈ లక్షణాలు పాటించిన వాళ్లే చిరంజీవులుగా నిలిచిపోతారని దీనర్థం. "జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్తనం మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః" అని పెద్దల మాట. "ధర్మాన్ని విడిచిపెట్టినవాడు బతికి ఉన్నా, చనిపోయిన వాడికిందే లెక్క. ధర్మంతో బతికేవాడు చనిపోయినా, చిరంజీవిగా నిలిచిపోతాడు" అని దీని భావం.